పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసినదికాదు. ఐనను శికందరుబేగముపవర యైనందువలన 1835 వ సంవత్సరమున నామెవివాహము జరిగెను. ఈ వివాహ సమారంభము బహు గొప్పగా జరిగెనట. వివాహము జరిగినతోడనే జహంగీరు తాను 'నవాబు' అను బిరుదును వహించి, రాజ్యముచేయ యత్నించెను. తనచేతిలోని రాజ్యము వదలగూడదని కుదషియాబేగము నిశ్చయించెను. ఇట్లు రాజ్యలోభముచే, అత్తగారును, అల్లుడును పరస్పర వైరులయిరి. ఇట్లు కొంతకాలము జరిగినపిమ్మట, నొకరితో నొకరు యుద్ధము జేయుటకయి వారిద్దరును సైన్యములను పోగుచేసిరి. కుదషియాబేగమును బట్టి కారాగృహమునం దుంచుటకయి జహంగీరుఖాన్ యత్నించెను. కాని యతనికి జాలునంత ధైర్యము లేనందువలన నతడీ యత్నమునందు విఫలుడయ్యెను. ఇట్టి యత్నము జరిగినతరువాత బేగము అత్యంత క్రోధాన్వితురాలయి యుద్ధమునకు సన్నద్థురాలాయెను. ఇద్దరికిని ఘోరయుద్థము జరిగి యందు జహంగీరు పరాజితుడయ్యెను. అందువలన నతనికి మూడు మాసముల వరకు గారాగృహవాసము చేయవలసివచ్చెను. కాని ఇంతలో ఇంగ్లీషువారును, మరికొందరును, మధ్యస్థులై, ఆయనను విడిపించి 1837 వ సంవత్సరమున రాజ్యాభిషిక్తుని జేసిరి. కుదషియాబేగముగారికి 60,000 రూపాయీల స్వతంత్రజమీన్‌ దారి యిచ్చిరి. అప్పటినుండి యామె భూపాళ రాజ్యవిషయమైన సంగతులలోనికి రాగూడదని కట్టుదిట్టములు చేసికొనిరి.

జహంగీరు రాజ్యము జేయుటయందు దక్షుడు కానందువలన లోకప్రియుడు గాకపోయెను. స్వభావముచేత దుష్టుడై