పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాయన కుమారుడగు నజరు మహమ్మదు రాజాయెను. ఇతడు తండ్రివలెనే బహుగుణసంపన్నుడయి ప్రజలను సుఖపెట్టెను. ఈ నవాబు కుమార్తెయే శికందరబేగము. హిందూదేశచరిత్రములో భూపాలబేగమని ప్రసిద్ధిగాంచిన నారీరత్న మీమెయే. నజరు మహమ్మదొక దినము తన కుమార్తెను ముద్దాడి యాడించుచుండగా, అతని బావమరదియగు, ఎనిమిది సంవత్సరముల వయస్సుగల ఫౌజదారుఖాన్ అచ్చటనే యొక చిన్న తుపాకి దీసికొని యాడుకొనుచుండ నందులోనిగుండు అకస్మాత్తుగా నెగిరి, నవాబుకు దగిలి యతనిని గతప్రాణుని జేసెను!

నజరు మహమ్మదుకు బుత్రు లెవరును లేకపోయిరి; శికందరు బేగమను కుమార్తెమాత్ర ముండెను. కాని యీమె చిన్నదైనందువలన నీమెకు రాజ్యము కట్టుటకు వీలులేక పోయెను. అప్పు డచ్చటి యధికారు లందరును కంపెనీవారి యనుమతి బుచ్చుకొని, నజరుమహమ్మదుకు నన్నకుమారుడైన మునీరమహమ్మదు ఖానునకు శికందరబేగమును పెండ్లిచేసి యతనిని నబాబుగా జేయవలయుననియు, వివాహ మగువరకు నజరుమహమ్మదు భార్య యగు కుదుషిబేగము రాజ్యము చేయవలయు ననియు నిర్ణయించిరి. అటులనే శికందరుబేగము తల్లియగు కుదుషియా బేగము రాజ్యాధికారిణి యాయెను. చేతికి సంపూర్ణాధికారము వచ్చినతోడనే యామె చక్కగా రాజ్యము చేయసాగెను. రాజ్యసుఖము బహుదినములవరకు ననుభవింపవలయు నన్న యిచ్ఛగలదై, కుదషియాబేగము తన