పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పుడు మంత్రిసత్తముడగు ధీరసింహుడు రాజునకు జగదేవుని సమాచారమంతయు జెప్పి, యతనియందెంతమాత్రము తప్పులేదనియు, వాఘేలీరాణియొక్క కుయుక్తులే జగదేవుని దు:ఖములకు గారణములనియు దెలియజెప్పెను. అప్పుడుదయాదిత్యుడు జగదేవుని కౌగిట జేర్చుకొని, ముద్దాడి, యతనిని యువరాజుగా నియమించెను. అప్పటినుండి ఉదయాదిత్య మహారాజుగారికి వాఘేలీరాణియం దసహ్యతగలిగి, యాయన సోళంకీరాణిగారినే ప్రీతితో జూచుచుండెను; కాని వాఘేలిని దిన్నగా జూడవలసినదని పతివ్రతాతిలకమగు సోళంకీరాణిభర్తకు జెప్పుచుండును. ఉదయాదిత్యుని యనంతరము జగదేవుడు సింహాసనమునెక్కి న్యాయముగా రాజ్యపరిపాలనము చేసెను.

జగదేవునకు ముగ్గురు భార్యలుండినను, వారియందరిలో మొదటినుండి, పతికి బ్రతికార్యమందును సహాయముచేసి, యతని ఛాయవలెదిరిగిన వీరమతియే యతని ముఖ్యమహిషిగా నుండెను. కాని, యామె సద్గ్రంథములను జదివినదిగనుక గణ్వ మహాముని శకుంతలకు నుపదేశించిన

    శుశ్రూష స్వ గురూన్ కురు ప్రియసఖీవృత్తిం సపత్నీజనే
    భక్తి ర్విప్రకృతాపిరోషణను యాస్మప్రతీపం గమ:
    భూయిష్ఠం భవ దక్షిణౌ పరిజనే భౌగ్యేష్వనుత్సేకినీ
    యాంత్యేవం గృహిణీపదం యువతయో వామా: కులస్యాధయ:

అను సదుపదేశము ననుసరించి సదాచారిణియై, గృహిణియన్న సార్ధక బిరుదమును వహించెను.


_____________