పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయినవెనుక రాజచ్చటికి వచ్చి, వారినిజూచి దు:ఖించి, తన దేహమునుగూడా దేవికి సమర్పింపబోగా దేవి ప్రత్యక్షయయి యతని నివారించి, మృతులయి పడియున్న జగదేవాదుల లేపెనట. ఈ రెండు చరిత్రములలో నేది నిజమైయుండవచ్చునో చదువరులే గ్రహింపగలరు.

ఇట్లు దుష్టుల దుర్మార్గత తెలిసినతోడనే రాజుగారు వారికి దగినశిక్షలను విధించి జగదేవుడు లోకహితార్థమైయును, రాజహితార్థమైయును జూపిన సాహసమునకయి యతనికి నేమి ఇచ్చినను ఋణము దీరనేరదని యెంచి, యతనికి బ్రభావతియను తన కుమార్తెనిచ్చి వివాహముచేసెను. కూతుతో ననేక గ్రామాదుల నల్లునికి వరదక్షిణ యిచ్చెను. దుష్టులు జగదేవునకు గీడుచేయదలచిరిగాని, యందువలన నతనికి మేలే కలిగెను.

ఈ ప్రకారము జగదేవుడు సుఖముగా కాలక్రమణము చేయుచుండగా నచ్చట ధారానగరములో ఉదయాదిత్యుడు వాఘేలిరాణీగారి కుతంత్రములనుగానలేక యామె చెప్పునట్టు రాజ్యము చేయుచున్నందున, రాజ్యములో నంతయు నన్యాయములు జరుగుచుండెను. ప్రజలందరు అసంతుష్టులై యుండిరి. ఈ సంగతులన్నియు జూచి దగ్గరనున్న యొకరాజు దండెత్తి వచ్చి, ఉదయాథిత్యుని రాజ్యమును దీసికొని, యతనిని, అతని బాంధవుల నందరిని గారాగృహములో వేసెను. ఈ సంగతి యంతయు జగదేవునికి దెలిసి యతడు, మామగారియాజ్ఞ పుచ్చుకొని, బయలుదేరి, ధారానగరమునకు బోయి, శత్రురాజుల నోడించి, తండ్రిగారిని మరల రాజ్యారూడునిగా జేసెను.