పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణిగారు చేసిన పనియే. కనుక, నీవు ధారానగరమునకు వచ్చి యీ సంగతినంతయు, మీ తండ్రిగారికి విశదపరచి, నీయందు దోషము లేకపోవుట స్థాపించుకోవలసినది. ఇందుకై నేను నీవైపున సాక్ష్యమిచ్చెదను." అందుపై, తానట్లుచేసిన తన సవతితల్లికి నవమాన మగుననియు, తా నింటినుండి బయలుదేరినప్పుడు తన బాహుబలముచే గీర్తి సంపాదించిగాని తండ్రికి ముఖము జూపనని ప్రతిజ్ఞ జేసితిననియు, తాను పట్టణమునకు వెళ్ళి యచ్చట తన బాహు విక్రమముచే గీర్తియు, శ్రీయు సంపాదించి, తల్లిని దండ్రినిజూచుటకు వచ్చెదననియు జగదేవుడు ధీరసింహునితో జెప్పెను. ధీరసింహుడందుకు సమ్మతించి, తన గుర్రములలో నొక దానిని జగదేవుని కిచ్చి, యతనియాజ్ఞ బుచ్చుకొని ధారానగరమునకు వెడలెను. అప్పుడు జగదేవుడు "మాతల్లిగారికి నా క్షేమసమాచారము చెప్పి, యామెకు నేమియు నాయాసము గాకుండ జూచుచుండవలసినది" యని చెప్పెను. ఆ మంత్రి సత్తముడు రాజధానికి బోయి యటులనే చేసెను. ఇచట నా దంపతు లిద్దరు గుర్రములపయి సవారులయి మార్గములో ననేక సంకటముల బడుచు కొన్ని రోజులకు బట్టణమని యపరనామము గల అణహితపురమునకు జేరిరి. ఆ గ్రామమునకు సమీపమున సహస్రలింగతటాకమను నొక చెరువున్నది ఆ తటాకతీరమున దిగి యచ్చటనే గుర్రములను, వీరమతిని ఉంచి తాను బసచూచివచ్చెద నని జగదేవుడు గ్రామములోనికి బోయెను.