పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఈ భరతఖండమునం దిప్పుడున్న స్త్రీలస్థితికి పూర్వ కాలమునం దుండిన స్త్రీలస్థితికిని మిక్కిలి వ్యత్యాసము గలదు. పూర్వకాలమునందలి సుందరులు విద్యలయందును, కళల యందును, పాండిత్యము కలవారయి పురుషులకుపదేశము చేయ దగినంత మంచిదశయందుగూడ నుండుచువచ్చిరి. వేదము నందు వర్ణింపబడిన గార్గి, మైత్రేయి మొదలయినవారినే ఇందుకు నిదర్శనముగా జెప్పవచ్చును; ఆ కాలమునందలి స్రీలు వేద వేదార్థము లెరిగినవారని చూపుటకు శకుంతల మొదలయిన వారిని దృష్టాంతముగా గొనవచ్చును: యజ్ఞాదులయందును, వివాహాదులయందును స్త్రీలు పఠింపవలసిన మంత్రము లుండుటయె మన పూర్వులు స్త్రీలు భాషాపాండిత్యము కలవారయి మంత్రార్థముల నెరిగియుండవలెనని యుద్దేశించినట్లు స్పష్టమగు చున్నది. ఆ కాలమునందు స్త్రీలు పురుషులవలెనే గౌరవింపబడు చుండిరిగాని యిప్పటివలె గదులలో మూసిపెట్టబడుచుండలేదు. వారికట్టి స్వాతంత్ర్యములు పూర్వకాలమునందు గలిగి యున్నవని చూపుటకు సీత మొదలగు క్షత్రియస్త్రీలు సహితము భర్తలతో వచ్చి సభలలో సింహాసనములమీద గూరుచుండుచు వచ్చిన వార్తను సూచించుటకంటె విశేష మేమియు జెప్పనక్కర లేదు. ఇవియవి యని వేరుగ జెప్పనేల? ఆకాలమునందలి స్త్రీలకుండవలసిన స్వాతంత్ర్యములనన్నిటిని వారు గలిగి యుండిరనుటకు సందేహములేదు. వారికప్పుడున్న విద్యా ప్రభావమునుబట్టి వారట్టి గౌరవములకును స్వాతంత్ర్యములకును నర్హురాండ్రయి యుండిరి. మన పూర్వులు గృహిణీ