పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారిని విస్మయ మొందించునట్టియు నా సరసవాణి శంకరులకు నత్యద్భుతముగా వాదము జరిగెను.

ఇట్లహోరాత్రములు పదియేడుదినములవరకును అసమానవిద్యావంతులగు సరసవాణి శంకరులకు ఘోరమయినవాదము జరిగి తుదకు సరసవాణి యడిగిన ప్రశ్న కుత్తరము చెప్పజాలక శంకరు లామెను నారు నెలల వ్యవధి యడిగిపోయి మరికొంత విద్య నభ్యసించి మరలవచ్చి యామెకు సమాధానము చెప్పెను. అందుపై మండనమిశ్రుడు సన్యసింపగా సరసవాణి దివి కరిగెను.

ఈ సరసవాణి చరితమువలన నామె కాలమునందలి హిందూసుందరులు గొప్ప విద్య నభ్యసింపుచుండి రనియును, వారు గొప్ప పండితులతో సహితము వాదవివాదములు చేయుచుండిరనియును దెలియబడుచున్నది. ఆ కాలమునందు నోరెరుగని పసిపాపలకు దల్లిదండ్రులు తమసమ్మతితో వివాహములు చేయు నాచారములేక కన్యావరులు యుక్తవయస్కు లయిన పిదప వారియనుమతి ననుసరించియే వివాహములు జరుగుచుండె ననియును స్పష్టముగా దెలియుచున్నది. అప్పటి సంఘ స్థితినిబట్టి చూడగా నప్పటి స్త్రీ లత్యంతోచ్చదశయం దుండినట్లు తేలుచున్నది. కాని ఆకాలమునం దట్టి యుచ్చపదవియందుండిన హిందూసుందరులు ప్రస్తుత మత్యంత హీనస్థితికివచ్చి తమ దుర్దశనే తెలిసికోజాలనంతటి యజ్ఞానిను లగుట మిగుల దు:ఖకరము. పూర్వకాలము నందలి స్త్రీలకును, ఈ కాలపు స్త్రీలకును గల తారతమ్యము సతీహితబోధినీ పత్రికోక్తమూగా నిం దుదాహహరించి యీ చరితము ముగించెదను.