పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లు విద్యాగుణ సంపన్నయగు నా చిన్నది వివాహ యోగ్యయయ్యెను. అప్పుడామె గుణవంతుడును, సురూప వంతుడును నగు విశ్వరూపా పరనామము గల మండనమిశ్రుని ఖ్యాతిని బ్రాహ్మణులవలన వినెను. మండన మిశ్రుడును సరసవాణియొక్క సద్గుణములు వినెను. అందువలనవారికి నుభయులకును నొకరి నొకరు చూడవలయునని యభిలాష జనించెను. కాని వారు తమతండ్రుల కాసంగతి దెలుపుటకు సిగ్గుపడి తమలో దామే కృశింపచుండిరి.

ఇట్లు కొన్నిదినములు గడచినపిదప తమపిల్ల లిట్లుకృశించుట కేమికారణమోయని వారి జననీజనకులు చింతించి యొకదినమునందు దాని కారణమును చెప్పక తప్పదని వారిని వారితల్లితండ్రులు బలవంత పరుపగా వారు నిజమయిన కారణమును దెల్పినవారైరి.

అందుపై హిమమిత్రుడు సరసవాణి తండ్రియొద్దకి కన్యకను విచారించుటకు బ్రాహ్మణుల నంపెను. వారికి విష్ణుశర్మ తగిన మర్యాదలు చేసి యాగమన కారణమడుగగా వారును తాము వచ్చినసంగతి నతని కెరిగించి పిల్లను మండనున కిమ్మని యడిగిరి. అందున కతడు తనభార్య నడిగి నిశ్చయించి చెప్పెదనని వారితో జెప్పి యామెనడుగగా నాయువతి యిట్లనియె.

"ధనము, కులము, శీలముగల వానికి బిల్ల నియ్యవలెనని శాస్త్రములయందును, వ్యవహారమునందును ప్రసిద్ధియే కదా? ఈ పిల్లడు దూరమున నుండువాడు. ఇతనికులశీలములు మనకు దెలియవు. కనుక నిందునగురించి యేమి చెప్పగలను"