పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరసవాణి

ఈ పండిత తన భర్తయగు మండన మిశ్రుడు శంకరాచార్యులవారితో వాదముచేసి యోడిపోగా దానాచార్యులతో వాదించెను. ఈమెకుగల యసమాన పాండిత్యమును సౌందర్యమును గని లోకు లీమెను సరస్వతి యవతారమని తలచిరి. అందువలన వారామెను ఉభయభారతి యని పిలుచుచుండిరి. ఈమె యాదిశంకరుల వారితో సమాకాలీను రాలయినందు వలన శంకరులవారి కాలనిర్ణయమే ఈమె కాలనిర్ణయమని వేరుగ జెప్పనక్కరలేదు. ఆది శంకరులవారు క్రీ.శ. 7 వ శతాబ్దమునం దుండిరని కొందరును, 8 వ శతాబ్దమునందుండిరని కొందరును 9 వ శతాబ్దమునందుండిరని కొందరును జెప్పుచున్నారు. కాని కొన్ని యాధారములవలన నాదిశంకరులవారు క్రీ.శ. 8వ శతాబ్దాంతమునను 9 వ శతాబ్దాదిని నుండినట్లు పండితు లనేకులు నిర్ణయించినారు.

శోణనది తీరమునందు విష్ణుశర్మయను బ్రాహ్మణునకు సరసవాణి యొక్కతయె కూతురు. అందువలన నతడామెను కడు గారాబముతో బెంచుచుండెను. తల్లిదండ్రులామెకు సకలవిద్యలను నేర్పిరి. సాంఖ్య, పాతంజల, వైశేషిక న్యాయ మీమాంసా, వేదాంతముల నెడి యారు శాస్త్రములును, వ్యాకరణాది షడంగములును, కావ్యనాటకములును ఇతరవిద్యలన్నియు నామె నేర్చెను. ఇందువలన లోకులామెను గని యద్భుత పడుచుండిరి.