పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భగవత్స్మరణ చేసికొనుచు నిశ్చితుండయ్యెను. తారాబాయియు నామె భర్తయు బరస్పరానురాగము కలవారై ప్రజలను కన్నబిడ్డలవలె బ్రోచుచుండిరి. వారిట్లు రెండు సంవత్సరములు సుఖముగా నుండగా వారికి నొక సంకటము ప్రాప్తించెను.

పృథివీరాజు బావయగు ప్రభురాయుడనువా డధిక దుష్టుడై తన భార్య నధిక బాధ పెట్టుచుండెను. పృథివీరాజు తన సహోదరికి గలుగు బాధలగని యూరకుండజాలక మంచిమాటలతో బావకు బుద్ధిచెప్పెను. ఆ దుష్టునికా వాక్యములు పామునకు బాలుపోసిననటులై యాతడు తన భార్యను విశేషముగా బాధింపదొడగెను. దానింగని పృథివీరాజు ప్రభురాయులకు గఠినోక్తులతో జాబువ్రాసెను. అప్పటినుండి యా దుష్టుడు పృథివీరాజుపై మిగుల కోపించియు కుత్సితము బయలుపడనీక పైకి మిగుల మిత్రత్వముతో నగుపడుచుండెను. ఇట్లుండి యాతడొకదినము పృథివీరాజును తన గృహమునకు విందునకు బిలిచి యాతనికి విషాన్నము పెట్టించెను. కపట మెరుగని పృథివీరాజు భోజనముచేసి మరల తన నగరునకు వచ్చుచుండెను. ఇంతలో నాతనికి విషమెక్కినందున నా త్రోవలో యాయన మూర్ఛితుడాయెను. ఈ వర్తమానము తారాబాయికి దెలియగా నామె యాసన్నమరణుడగు భర్త కడకేగి యాతనికి దగు చికిత్సలు చేయుచుండెను. కాని యందువలన నెంతమాత్రమును సుగుణము కాక తుదకాయన స్వర్గస్తుడయ్యెను. అంతటితో తారాబాయి జీవనచరిత్ర. ముగిసెను. రాజపుత్రుల కులాచారమగు అనుగమనము చేసి తారాబాయి పరమపదమున కేగెను.