పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిగుల సంతోషముతో దానును నాతనితో యుద్ధయాత్రకు వెడలెను. పృథివీరాజు ఏడెనిమిదివేల క్రొత్తసైన్యమును సిద్ధపరచి అఫగణ దేశస్తులను గెలుచుటకై థోదానగరముపైకి దండు వెడలెను. ఆసమయమునందు దారాబాయి పురుషవేష ధారిణియై గుర్రమునెక్కి ప్రత్యక్ష మహిషాసురమర్దని యన నా యవనుని నంత మొందింప బ్రయాణమయ్యెను!

వీరందరు థోదానగరమును సమీపించిన దినమున దురకుల కధికోత్సాహకరంబగు మొహరం పండుగయొక్క తుదిదినమయినందువలన నా నగరవాసులగు దురకలందరు పీర్లను గుమ్మటములలోనుంచి యూరేగింపుచు నానంద మహోత్సవములో నిమగ్నులైయుండిరి. ఆ మహోత్సవావలోకన తత్పరుడయి యచటి ప్రభువగు దిల్లా తన మేడపై దివ్యవస్త్ర భూషణముల నలంకరించుకొనుచుండెను. అట్టి సమయమునందు దమసైన్యము నంతను నగరద్వారమున నునిచి పృథివీరాజును, తారాబాయియు మరియొక భృత్యుడును, ఉత్సవము గనవచ్చినవారివలె నా మూకలో జేరిపోవుచుండిరి. ఇట్టు లరుగునపుడు తారాబాయి తన జనకుని శత్రువు నెరింగి గురిపెట్టి యొక బాణమాతనికి దగులునట్లు వేసెను. మూకలో నుండి వచ్చిన యాశస్త్ర మా యవనును రొమ్మునం దవిలి వానిని యమసదనమున కనిచెను. తక్షణమే యవను లానగర ద్వారమున నొక మత్తగజమును కావలియుంచి తమ ప్రభువు ప్రాణముల నపహరించిన యోధుని వెతుకజొచ్చిరి. కాని వారి కెచటను నాతడు పట్టుబడినవాడు కాడు.