పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17 వ తేదీని బ్రిగోడియర్ స్మిథ్ అను సైన్యాధిపతి గ్వాలేరు పూర్వదిక్కుననున్న సైన్యములపై బాణవృష్టి చేయసాగెను. అది రాణిగారి బలమగుటవలన నాసైనికు లింగ్లీషు వారిబలముల నాదినమున ధైర్యముతో మార్కొని నిలిచిరి. రెండవదినమును లక్ష్మీబాయిగారి వీరోత్సాహవచనముల వలన నా సైన్యములు పరబలంబులం బొడిచి తామును మృతులగుచుండిరి. లక్ష్మీబాయిగారి శౌర్యముం గని యాంగ్లేయ సేనానాయకులు మిగుల నద్భుతపడి యామె నోడింప నిశ్చయించిరి. ఇట్లు వారు నిశ్చయించి నలుదిక్కుల నుండి యామె సైన్యముపై బాణపరంపరలు పరపుటచే నా సైన్యంబులు నిలువక పారజొచ్చెను. ఇట్లు తన ముఖ్యసేవకులు కొందరుదప్ప నందరును తనను విడిచినందునను, అంతకుముందే యితర సేనాధిపతు లపజయమునుబొంది పలాయితు లగుటవలనను, లక్ష్మీబాయి తన ఖడ్గబలముచే శత్రుసైన్యములలోనుండి యనేక శూరులం బొడుచుచు నావలకు బోవుచుండెను. ఇట్లామె బహుదూరము వెళ్ళినపిదప నామెతో పురుషవేషము ధరించి యున్న 'ముందర' యను దాసియొక్క యంతిమశబ్ద మామె చెవినిబడెను. అందువలన నామె వెనుక తిరిగి తన ప్రియదాసిని జంపినవానిని యమపురమున కనిపి ముందుకుసాగెను. ఇట్లు ముందతిత్వరగా నరుగుచుండ నొక జలప్రవాహ మడ్డపడినందున ననేక గాయములచే క్షీణించియున్న యామె గుఱ్ఱ మాప్రవాహమును దాటజాలక నిలిచెను! లక్ష్మీబాయిగా రాగుఱ్ఱము నావలకు దీసికొనిపోవ ప్రయత్నించెనుగాని యాపని సిద్ధించి