పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమర్పించి యంకితం బొనర్చుచుచున్న దానను." అని పాలిత సతీ ధర్మయైన యీ ధన్య యమృతరసముతో నిట్లు వ్రాసియున్నది. ఈ విషయములలో నీ సాధ్వి వ్రాసిన వ్రాత కాక, ప్రత్యక్షాదరణములుగూడ నా పుణ్యవశమున నాకుగూడ లభించెను. ఈమె భర్తృ పుత్రికాసహితై మాగృహంబున నొక సమయమున గొన్ని దినంబులుండి ననుధన్యను గావించినది. ఈసతి మా ఇంటనున్న సుదినంబులలో నొకదినంబున మధ్యాహ్న మందరమును భోజనములు చేసి వాకిట గూర్చుంటిమి. ఆనాడెప్పటి యట్టు నేనీ సఖీమణియొద్ద గూర్చుండి తాంబూలము గైకొనగోరుచు వక్కలామె చేతనిడి యాకులు మడిచి యిచ్చుచుంటిని. ఇట్లు నేనిచ్చు వక్కలును, ఆకుమడుపులుగూడ కైకొని చేయి నింపుచుండెనేకాని యచ్చటివారందరు దాంబూలములను గైకొనుట పూర్తియైనను తానుమాత్ర మట్టెయుండెను. అదికని తాంబూలము గైకొనుడని నేనొకటి రెండుసారు లడీగితిని కాని, అట్లె గైకొందునని నాకు నెమ్మదిగా నుత్తరువు సెప్పుచు నేను మరియొకసారి యడిగినపుడు చిన్ని--వు గైకొనుచు నూరకుండెను. అప్పటి మా యిరువురి స్థితిని జూచుచు మాయొద్ద గూర్చున్న మీనాక్షమ్మగారు (అచ్చమాంబగారి సవతికూతురు) మేము గూర్చున్న వాకిలి తలుపించుక దీసి మగవారు కూర్చుండి మాటలాడుచున్న వాకిలివంక జూచివచ్చి మా తండ్రిగారింకయు దాంబూలము వేసికొనలేదు. వారు వేసికొనినగాని యామె వేసికొనదని చెప్పెను. అందుకు ముందే మగవారు తమ భోజనములు కాగానే తాంబూలపు పళ్లెరము గైకొనినవారైనప్పటికిని అచ్చమాంబ గారి భర్తగారు నాడు జరుగుచున్న ప్రసంగావసరములో దాంబూలమును స్వీకరింపకట్లాలస్యము చేసిరి. పతిభక్తి తత్పరయగు నా సాధ్వీమతల్లి యా సంగతి గ్రహించుటచే నట్లొనరించెను. సర్వకాల సర్వావస్థలయందును దేవాధి దేవునిగా నిట్లీసతి పతిని సేవించుట నేను కొన్ని నాళ్ళవరకు గన్నులార గాంచుచు బూర్వ సతీమతల్లులగు సీతాంగనాదుల గాంచుచున్నట్లానంద నీరధి నోలలాడితిని. ఈ యుత్తమ సతివలన బతివ్రతాధర్మము లిట్లు నియతిగా బాలింపబడినవి. పరపురుషులున్న తావునుండి దూరముగా దొలగిపోవుటయే కాని, తనకేదియైన నవసరమున్నను నటనించుక సేపైనను నీ సతి నిలుచునది కాదు. తగినంతపని వచ్చినయెడల దలవంచుకొని సోదరులతో భాషించునట్లు సంగ్రహముగా భాషించి వెడలిపోవుచుండెడిది. ఆహా! యిట్టి నారీరత్నములే