పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భేదించుకొని క్షణములో నదృశ్యయగుట కెవ్వ రాశ్చర్య పడకుందురు?

మహారాణి లక్ష్మీబాయి రారాత్రి బయలుదేరి తనను బట్టవచ్చువారికి దృగ్గోచరయుగాక సూర్యోదయమునకు ఝాశీ సంస్థానమునకు సరిహద్దుయిన భాండేరయను గ్రామమున బ్రవేశించెను. అచట నామె గుర్రమును దిగి కొమారునకు ఫలహారముబెట్టి మరల నశ్వారోహణము చేసెను. ఇంతలో నాంగ్లేయ సైన్యాధిపతి కొంత సైన్యముతో దనను బట్టవచ్చెనని యామె వినెను. ఆ సమయమునం దామెయొద్ద బదునైదుగురు శూరులుదప్ప వేరుసైన్యము లేదు. అట్లయ్యును ఆ శూరశిరోమణి జంకక తన ఖడ్గము నొరనుండి తీసి యుద్ధసన్నద్ధయై చనుచుండెను. ఇంతలో నా సైనికులామెను ముట్టడించిరి. కాని యామె తన యుద్ధనైపుణ్యమువలన నా సైనికులను చీకాకుపరచి కొందరిని యమసదమున కనిచి క్షణములో నదృశ్యయయ్యెను. బహు సైన్యసమేతముగానున్న యాంగ్లేయ సేనాధ్యక్షుని స్వల్పసైనికులతో నొక యబల యోడించి పంపుట యెంతయు వింతగదా! అచటినుండి బయలుదేరి యారాత్రి యామె కాల్పీనగరమున నానాసాహేబునొద్ద బ్రవేశించెను. ఇట్లు నిద్రాహారములు లేక యామె యశ్వారోహనము, చేసి 108 మైళ్ళు ప్రయాణముచేసెను. దీనినిబట్టి చూడగా నామె ధైర్యమును అశ్వారోహణ శక్తియు నందరికి నత్యద్భుతమని తోచక మానదు.