పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఝాశీరాజ్యము మహారాణి లక్ష్మీబాయిగారు పాలింపుచున్నసంగతి విని వారి వంశీకుడగు సదాశివనారాయణ యనునాతడు ఝాశీ సమీపమునందున్న కరేరాయను దుర్గమును వశపరచుకొని యచట దాను ఝాశీరాజ్యాభిషేకము గావించుకొనెను. అబలయగు రాణిగారు రాణివాసము నందుండినదిగాన నామె తనకు లొంగునని తలచెను. కాని రాణిగారు సబలయై సైన్యమునంపి యాతనిబట్టి తెప్పించి ఝాశీ కిల్లాలో బంధించి యుంచెను.

ఇట్లొకశత్రుని బరిమార్చునంతలో రెండవ శత్రుడుత్పన్నమాయెను. ఝాశీకి సమీపమునందున్న ఓరచాసంస్థానపు దివాను, నధేఖా యనువాడు విశేషసైన్యముతోడ దాడి వెడలి రాణిగారి కిట్లు వర్తమానమంపెను. "మీకిదివర కాంగ్లేయ ప్రభులిచ్చుజీతము మే మిచ్చెదముగాన రాజ్యమును మాస్వాధీనము చేయుడు". ఈ వార్తవిని రాణిగారి ప్రధానసామంతులందరును భయభీతులయి మనకు పించెను నిచ్చినయెడల సంగ్రామముతో బనిలేదనియు వారితో యుద్ధముచేసి గెలుచుట సాధ్యము కాదనియు జెప్పిరి. కాని యసామాన్య శౌర్యముగల రాణిగారు వారి మాటలను వినక యాశత్రువున కిట్లు వర్తమానమంపెను. "ఆంగ్లేయులు సార్వభౌములు. వారు నిగ్రహానుగ్రహములకు సమర్థులు. వారితో సమానులు కానెంచి యాజీత మిచ్చెదననెదవు. కానినీవంటివా రింక పదుగురు వచ్చినను స్త్రీనగు నేను వారినందరిని పౌరుషహీనుల జేయజాలుదుననగా నిన్ను లెక్కింప నేల?" ఇట్టివార్త నదేఖాకు