పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లు కొన్నిరోజులు సౌఖ్యములో గడచిన పిదప లక్ష్మీబాయిగారి దు:ఖమునకు బ్రారంభమయ్యెను. ఆమె కొక పుత్రుడు గలిగి మూడుమాసములు జీవించి మృతిజెందెను. గంగాధరరావు మహారాజుగారి మనస్సునందు పుత్రశోక మధికమయినందున ఆయన నానాటికి క్షీణించి, వైద్యోపచారముల వల్ల నడుమనడుమ కొంచెము స్వస్థపడుచుండెను. ఇట్లు కొన్నిదినములు గడచినపిదప 1853 వ సంవత్సరము అక్టోబరు నెలనుండియు నాతని శరీరము మరింత క్షీణింపసాగెను. అనేక రాజవైద్యులు సదా సమీపమునందుండి యౌషధోపచారములు చేయుచుండిరి. కాని యెంతమాత్రమును సుగుణ మగుపడు జాడ గానరాకపోయెను. నవంబరు 15 వ తేదినుండి గంగాధరరావు ప్రకృతియందు వికారచేష్ట లనేకములు కానిపించుచు వచ్చెను. అందువలన సంస్థానపుమంత్రియగు నరసింహరావును మోరోపంతు తాంబేగారును గలిసి ముందు సంస్థాన వ్యవస్థనుగూర్చి మహారాజులంగారితో ముచ్చటించిరి. వారి ప్రసంగమును వినిన పిదప దన కిప్పుడే రోగ మసాధ్యముగా లేదనియు, ముందసాధ్యమగునేని తమ వంశమునందలి ఆనందరావును తనకు దత్తపుత్రునిగా జేసి యనంతర మాచిన్నవాడు స్వరాజ్యభారశక్తుడగు వరకును వానిపేరిట లక్ష్మీబాయియే రాజ్యము బాలింపవలయుననియు జెప్పెను. అందుపై వారంద రాక్షణముననే ముహూర్తనిశ్చయము చేసి త్వరలోనే శాస్త్రోక్తముగా దత్తవిధి నడిపిరి. ఆ మహోత్సవమునకు ఝాశీ యందలి యనేకప్రముఖులను బిలిచిరి. వారితోడనే బుందేల