పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణి ఝాశీ లక్ష్మీబాయి

భరత ఖండమునందు శౌర్య మహిమవలన బ్రఖ్యాతలయిన యువతీ రత్నములలో ఝాశీలక్ష్మీబాయి యగ్రగణ్యురాలు. ఈమె శౌర్యాగ్ని 1857 వ సంవత్సరము వరకును దాగియుండి యాకస్మికముగా బ్రజ్వలించెను. ఈమె రాజ్యముత్తర హిందూస్థానమునందలి బుందేల ఖండమను ప్రదేశమునందలి యొకభాగము. ఈ రాజ్యము లక్ష్మీబాయిగారి మామగారి యన్నయగు రఘునాథరావుగారి ప్రతాపమునకు మెచ్చి పూర్వము ఈపూనా పేష్వాగారిచ్చిరి. ఆయనకు బుత్రులు లేనందున ఆయన తమ్ముడగు శివరాంభావుగారి నభిషిక్తుని జేసిరి. ఈ శివరాంభావుగారి కాలమున పూనా పేష్వాల ప్రతాప మడుగంట నారంభించినందునను, రెండవ బాజీరావుగారి రాజకార్య నిపుణత్వ శూన్యతవలనను ఈయన వారి నతిక్రమించి స్వతంత్రుడాయెను. కాని యింతలో నాంగ్లేయప్రభుత్వ మెల్లడలను వ్యాపించినందున శివరాంభావు గారాంగ్లేయులతో సఖ్యముచేసి యనేక సమయముల యందింగ్లీషువారి కనేకవిధముల తోడుపడెను. శివరాంభావుగారికి కృష్ణారావు, రఘునాధరావు, గంగాధరరావులను ముగ్గురు పుత్రులుండిరి. వారిలో బెద్దవాడగు కృష్ణారావు తండ్రి బ్రతికి యున్న కాలములోనే మృతిజెందినందున శివరాంభావుగారి యనంతర మాయనకొమారుడగు రామచంద్రరావుగారికి