పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వడ్డించి విందారగింపవచ్చిన యువతులకు మహారాష్ట్ర స్త్రీవలె జీరలు, గాజులు, కుంకుము మొదలయిన వలంకరించి చేతితో భోజనము చేయువిధ మంతయు వారికి దెలిపి తానును వారితో గూర్చుండి భోజనము చేసెను.

తదనంతరమునం దామెను దీసికొని కార్పెంటరు దొరసాని ఫిలడల్ఫియా పట్టణమున కరిగి యచట నామె కనుకూలమగునటుల నిల్లు మొదలయినవి విచారించి, మరలి తన గ్రామమునకు వచ్చెను. ఆనందీబాయియు నచట విద్య నభ్యసింపుచు స్నేహితురాండ్ర గలసియుండెను. అచట నామె నాలుగు సంవత్సరములు విద్యాభ్యాసము చేసెను. ఆవ్యవధిలో నామెకనేక శారీరకమానసికదు:ఖములు కలిగి యామెదేహము నానాటికి క్షీణింపసాగెను. ఆమె చదువుకొను కాలములో హిందూదేశమునుండి యనేక స్త్రీవిద్యాశత్రువులు మిగుల హేయములగు జాబులను వ్రాసి యామెకు మిగుల విచారము కలుగజేసిరి. కొంద రామె పరదేశమున కరిగి స్వధర్మమును విడిచెనని యామె భర్తకు జెప్పి యామెపై మనసు విరుపజూచిరి. కాని వారి ప్రయత్నము లెంతమాత్రమును కొనసాగినవికావు. ఇట్లు సత్కార్యములకు నెట్లయిన విఘ్నములు గావింపవలయునని తలపుగల ధర్మాచరణ పరాయణులు మనదేశమునం దున్నందుకు నెంతయు జింతిల్లవలసి యున్నది. అమెరికాలోనుండగా ఆనందీబాయి యనేకోపన్యాసముల నిచ్చి యచ్చటి విద్వాంసులను మెప్పించెను.