పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డెరుగనివారు వీనినెల్ల వినినపిమ్మట నమెరికాదేశమునకు నేనుపోవ యత్నించుట కేవలము వేడుకకై గాదని యెంచెదరనియే కాని మరియొక తలపున గాదు.

3. నేనొంటరిగా నేల విదేశమునకు బోవలెనను మూడవ ప్రశ్నకుత్తరమేమనగా:- తొలుత నేను, నా పెనిమిటియును గలసి వెళ్ళుటకే యుద్దేశించితిమి. కాని స్థితిగతులనుబట్టి యాతలంపు మానుకొనవలసివచ్చెను. మాయొద్ద ధనమా చాలినంత లేదు. ఋణమా చేయుటకు మా కిష్టము లేదు. ఈ హేతు వొక్కటియెకాక, యింతకంటె ముఖ్యములయినవి యందరి నొప్పింప దగినవి మరికొన్ని గలవు. అవి యేమనగా నాభర్తగారికి వయోవృద్ధయగు జననియు, పసివాండ్రుగా నున్న తోబుట్టులును, తమ్ములును గలరు. వారందరికి సంరక్షకుడు నాభర్తగారే యగుటచేత నాయన నాతో గూడ వచ్చిరేని వారు దిక్కుమాలిన వారలయి, వారి బ్రతుకు భగ్నమయి, వారు తీరని దారిద్ర్యబాధలకు లోనగుదురు. నా యొక్కతకొరకు పెక్కండ్రను మలమలమాడునట్లుజేయుట ఎంత యమానుషకృత్యము! కాబట్టి నే నొంటరిగా నేగ నిశ్చయించితిని.

4. నే నిండియాకు (హిందూదేశమునకు) మరల వచ్చినప్పుడు నాకు బహిష్కారము గలుగక యుండునా యనుదానికి సమాధానము:- అట్టి భయమువలన నేను చలించెదనని తలంతురా? నేనందుకు నావంతయినను వెరవను. ఇక్కడ నే విధముగా నుంటినో, యక్కడగూడ నాతీరుననే యుండ నిశ్చయించుకొని యుండగా నాకు బహిష్కార మేల కలుగును?