పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యాభ్యాసము కానేరదు. కాన నొంటరిగానైన నరుగుట యావశ్యకము. మన మిరువురము కలసి వెళ్ళవలెననినచో నింకను రెండుసంవత్సరముల వ్యవధి గలదు. ఇంతలో నీచదువచట జాలవరకగును.

ఆనందీబాయి:-(ఏమియు ననక భర్తవంకజూచి మీరేమనెదరని యడిగినటుల నగుపడెను; దానింగని,)

గోపాలరావు:- నేటివరకును బ్రాహ్మణ స్త్రీ పరదేశమునకరిగి విద్యనభ్యసించిన యుదహరణ మెందును గానరాదు. కాన నీవు వెళ్ళి విద్యనభ్యసించి యుదాహరణీయవగుము. స్త్రీలు సామర్ధ్యహీన లన్నవాక్యమును నీవబద్ధము చేయుము. మన నడవడిని విడువక అమెరికావారికి మన నడవడిని నేర్పుము. ప్రస్తుతము సంస్కరణము కావలయు ననువారు పెక్కండ్రు పురుషులు కలరు. కాని వారిచేత గొంచమైనను సంస్కరణమగుట లేదు. నీవు స్త్రీవై కొంచెము సంస్కరణము చేసి చూపి నను మిగుల నుపయోగ కరముగా నుండును.

అందు కానందీబాయి సమ్మతించి యెంతదూరదేశ ప్రయాణమునగు సాహసించెను! ఆమె తన కెట్టి కష్టములు వచ్చినను వెనుకదీయక స్వదేశ సోదరీమణుల కొక యుదహరణముచూపి వారికి మేలుచేయ దలచెను!!

ఇట్లూ వారు కృతనిశ్చయులయి ఆనందీబాయికొర కమేరికాలో ననుకూలమగు బట్టలను కుట్టించి, సిద్ధపరుచుచుండిరి. ఆనందీబాయి పరదేశపువస్త్రములు ధరియింపనని నిశ్చయించుకొని మనదేశమునందలి ముతక బనాతుగుడ్డలతోనే దుస్తులను