పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వానుభవము వలననే తెలిసికొనెను. ఇట్లుత్తర ప్రత్యుత్తరముల వలన నా యిరువురకును సఖ్యమధిక మయ్యెను.

తదనంతరము గోపాలరావుగారిని కలకత్తాకు మార్చిరి. అచ్చట నుండుకాలములో పోస్టుఆఫీసులో 30 రూపాయల వేతనముగల యుద్యోగము ఆనందీబాయికొరకు సిద్ధమయ్యెను. కాని యుద్యోగములో బ్రవేశించి స్వతంత్రతను పోగొట్టుకొనుట కిష్టములేక, యామె దానిని స్వీకరించకుండెను. తదనంతర యామెకు నమెరికాలో వైద్యవిద్య నభ్యసించుకోరిక యధిగమయ్యెను.

కలకత్తానుండి శ్రీరామపురమను స్థలమునకు మార్చినందున నాదంపతు లచటి కరిగిరి. అచటి కరిగినపిదప గొన్ని దినములు సెలవు తీసికొని వారు సమీపమునందుగల జయపూర్, ఆగ్రా, గ్వాలేర్, లఖనౌ, కాన్‌పూర్, డిల్లీ, ప్రయాగ, కాశీ మొదలగు ప్రసిద్ధి పట్టణములను జూడ నరిగిరి. అందువలన ఆనందీబాయికి గొంతవరకు ప్రవాసస్థితి తెలిసెను. వారు మరలి శ్రీరామపురమునకు వచ్చిన కొద్దిదినములలోనే రెండు సంవత్సరముల సెలవుతీసుకొని అమెరికాదేశమున కరుగ నిశ్చయించిరి. కాని యింతలో నీకు సెలవియ్యజాలమని పైనుండి యుత్తరవు వచ్చెను. అందువలన ఆనందీబాయి నొకర్తనే యమెరికాకు బంపదలచి గోపాలరావుగారామెతో నొకదిన మిట్లు ప్రసంగించిరి:-

గోపాలరావు:- (చింతతో) నీవు ఒంటరిగానే అమెరికాకు వెళ్ళరాదా? నా కిప్పుడు సెలవు దొరకదు. నీకిచటనుండిన