పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోపాలరావు ననేక కష్టముల పెట్టుచుండిరి. కాన నచటనుండుట కిష్టములేక, కోలాపురమునందు స్త్రీవిద్య కనుకూలు రగువా రున్నందున బహుప్రత్నముతో గోపాలరావుగారచటికి మార్చుకొనిరి. కోలాపురములో బాలికాపాఠశాల వీరింటికి దూరమగుటచే ఆనందీబాయిని నొక్కర్తనంతదూరము కాలినడకతో బంప వీలులేక యుండెను. పాఠశాలలో నుపాధ్యాయినిగా నుండిన మిస్ మాయసీగారి యిల్లు వీరియింటికి సమీపమునందుండెను. ఆమె బహుమంచిదని విని గోపాలరావుగా రామెతోడ మాటాడ నరిగెను. ఆయన ప్రసంగవశమున "నా భార్యను మీబండిలో గూర్చుండబెట్టుకొని వెళ్లెదరా" యని యడుగగా నామె కొంత యోచించి మంచి దనియెను. అందుపై ఆనందీబాయి కొన్నిదినము లచటి పాఠశాల కరుగుచుండెను. కాని యటుపిమ్మట మాయసీ తన బండిలో స్థలమియ్యనందున నామె పాఠశాల కరుగుట మానుకొనవలసిన దాయెను.

కోలాపురమున నీదంపతులు పాద్రీల (క్రైస్తవధర్మ గురువుల) యిండ్లకగుచుండిరి. పాద్రీ యాడువారు ఆనందీబాయికి నింగ్లీషు రెండు మూడుపుస్తకములవరకును నేర్పిరి. ఆనందీబాయి యల్పవయస్కురాలయినను వారు చేయు మతబోధను గ్రహింపక కేవల నీతివాక్యములనే గ్రహింపుచుండెను. వీరివలననే యీదంపతుల కమేరికాలోని సంగతు లనేకములు తెలిసెను. కాన నమేరికాలోని కరిగి విద్యనభ్యసింపవలయునని ఆనందీబాయి కప్పటినుండి యిచ్చగలిగెను.