పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రమదేవి

ఈ సతీరత్న మాంథ్రదేశమునందలి యోరుగంటిరాజ్యమును మిక్కిలి చక్కగా నేలిన శూరవనిత. ఈమె కాకతీయ గణపతిరాజుభార్య. దేవగిరిరాజు కూతురు. రుద్రమదేవి తన భర్త మరణాంతరము క్రీ.శ. 1257 వ సంవత్సరమునుండి 1295 వ సంవత్సరము వరకును ముప్పదియెనిమిది సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లు దానశాసనములవలనను, చరిత్రకారులు వ్రాసినదానివలనను స్పష్టముగా దెలియుచున్నది. సోమదేవరాజీయమునందును రుద్రమదేవి ముప్పది యెనిమిది సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లీ క్రింద పద్యమున జెప్పబడినది.

గీ. ఆయనకు నప్పగించి యయ్యమ్మ యట్లు
   బుధజనంబులు బ్రజలును బొగడ నవని
   ముప్పదియు నెన్మిదేడులు మోద మొదవ
   నేలి కైలాసశిఖరి నేగుటయును.

కాకతీయగణపతి మరణానంతర మాతనిభార్య యగు రుద్రమదేవి దు:ఖసముద్రమున మునిగి యుండెను. అప్పుడు మంత్రియయిన శివదేవయ్యగారి హితవచనమువలన నామె దు:ఖమును మరచి రాజ్యమునకు వారసు లెవ్వరును లేక యుండినను కూతురగు ఉమ్మక్కకు గలుగు సంతానమే సింహాసనము నెక్క నర్హులని కొంత మనస్సమాధానము చేసి