పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కున్నదిగదా! అచ్చమాంబగారి తమ్ముడగు లక్ష్మణరావుగారికి పెద్దలు శ్రద్ధగా విద్యాభ్యాసము చేయించుచుండిరి. తమ్ముడు చదువుకొనుచుండు సమయములందు అచ్చమాంబగారు తమ్మునియొద్ద గూర్చుండి యాయనతో దానుగూడ సహజాభిలాషతో విద్య నభ్యసింప మొదలుపెట్టెను. అప్పుడు తన తమ్ముడభ్యసించుచున్న తెలుగు, హిందీ, భాషలను దమ్మునితో సమానముగా నేర్చుచు, నంతకంతకు దమ్ముడు చదువుపాఠముల నాతనికంటెముందు తానేవల్లించుచు, నిట్లఖండమైన తెల్వితో గొంతకాల మారెండు విద్యల నభ్యసించెను. తదనంతరము లక్ష్మణరావుగా రింగ్లీషుభాషాభ్యాసమునకై నాగపురమునకు బోవలసిన వారైరి. తనకు విద్యాభ్యాసమున దోడైన తనతోడు తనను వీడి యితరస్థలమున కేగగానే తానొంటరియైనప్పటికి నీమె స్వయంకృషిచే విద్యాభ్యాసము చేయుచుండెను. మరియు దామప్పుడ్నూ మధ్యపరగణాలలోనిదైన మహారాష్ట్రభాషనుగూడ కృషిచేసి యభ్యసించుచు దానిలో గూడ దగుపాటి జ్ఞానము సంపాదించెను. అచ్చమాంబగారి సహజన్ముడై, స్త్రీవిద్యాభిమానియు, సుగుణ శోభితుండునైన లక్ష్మణరావు గారు మాత్రము తమ స్కూలు సెలవులలో దన యక్కగారియొద్దనే యుండి తత్పరతతో నామెకు విద్యాభ్యాసమున సాహాయ్యము చేయుచుండెను. ఇట్లు సుగుణ వంతుడగు తమ్ముని సాహాయ్యము, అచ్చమాంబగారు, తెలుగు, హిందీ, మహారాష్ట్రము, బంగాళము, ఘూర్జరము అను నైదుభాషలయందు బాండిత్యము సంపాదించెను. సంస్కృతమునందును స్వల్పముగా నీమెకు బరిచయము కలదు. ఇందలి మొదటి మూడుభాషలయందు సమానమగు విశేష పాండిత్య మీమెకుండెను. గుణనిధియగు తమ్ముని సాహాయ్యమున నచ్చమాంబగారింతియకా దింకయు ననేక ఘన కార్యము లాచరింపగల్గెను. మన హిందూదేశపు సోదరీమణులిట్టి సోదరవర్యు నూటికి బదుగురైనను గల్గి నింతలో మనదేశము యధాస్థితికి రాదా ? ఇంకేమికావలయును ? ఇచ్చువారికిని బుచ్చుకొనువారికిని దరుగని ధనంబగు నిట్టి విద్యాధనం బవ్యాజప్రేమతో దమ సోదరీతతి కొసంగు సోదరులే నిజమగు సోదరులు. కాని, యేడాదికి నాల్గుసారులింటికి దీసికొనివచ్చి నశ్వరధంబులగు నాల్గుసారెలు నాల్గు చీరెలుమాత్రము పెట్టి కన్నులు తుడుచు సోదరులు సోదరులా? లోకములోని సోదరులు తమ సోదరీమణుల యెడల శ్రీమతి అచ్చమాంబగారి సహోదరు ననుక రింతురు గాక!