పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుగుణపుంజము లీమెతో జిన్ననాటనుండియు వర్థిల్లుచున్నవి. గనుకనే తన జీవిత కాలమందీమె యనేక విద్యలయం దారితేరి గర్భశోకాదులకు సహించి దీనజనులను గన్నబిడ్డలట్టు గారవించుట మున్నగువాని యందెంతయు ఘనతను బొందగల్గెను!

అచ్చమాంబగారి కారేడుల యీడువచ్చునప్పటికే అనగా క్రీ.శ. 1880 సం||న బితృవియోగ దు:ఖము తటస్థించెను. వెంకటప్పయ్యగారు మృతులైన పిదప గంగమాంబగారు తమ కుమారితెను, గొమారుని వెంటబెట్టుకొని యప్పుడు నైజాము రాజ్యములోని దేవరకొండ యను గ్రామమున నుద్యోగము చేయుచున్న తన సవతికుమారుడు శంకరరావుగారి యొద్దకేగెను. వీరచట నున్న కాలములో మధ్యపరగణాలలో నుద్యోగమందున్న గంగమాంబగారి అన్నగారగు భం. మాధవరావుగారికి ప్రధమ కళత్రవియోగము కలుగగా శంకరరావుగా రచ్చమాంబగారిని మాధవరావుగారికిచ్చి వివాహము చేసిరి. అది మొదలు తమ యంత్యదశవరకును అచ్చమాంబగారు మధ్యపరగణాలలోనే యుండిరి.

ఇది మొదలీమె జీవితకాలమందలి ప్రతినిముషము దోడి సోదరీలోకమునకు సన్మార్గ బోధకముగా నొప్పుచున్నదని చెప్పవచ్చును. భగవంతుడీమెను లోకమునకు సన్మార్గదీపికగా నుద్దేశించి సృజించెననుటకు సందేహములేదు. "చిన్న నాడు మావాండ్రు నాకు జదువు చెప్పింపలేదమ్మా! నాకిక చదువెట్ల వచ్చున"ని తలంచు మన కొందరు వెర్రిసోదరీమణుల తలంపులు, 'కాలుజారిపడి నాకీ యూరచ్చిరాదను' కొనుటను బోలియుండునవి యని అచ్చమాంబగారు తన విద్యాభ్యాసముయొక్క యుదాహరణమువలన నిరూపించుచున్నది. అచ్చమాంబగారికి పదియేడుల యీడువచ్చి వివాహమై భర్తతో మధ్యపరగణాలకు బోవువరకును విద్యయన నేమో తెలియదు. ఇదియే యీమె విద్యాభ్యాసమున కారంభసమయము. ఇపుడైనను బడికిబోయిగాని, పెద్దవారింటి యొద్ద జెప్పించుటచేగాని విద్య లభ్యసించుట కాదు. చివరకదెట్లు ఫలించిన నట్లు ఫలించును గాని, మనవారు జ్ఞానసంపాదనమునకని కాకపోయిన నుదరపోషణార్ధమని తలంచి యయిదేడుల యీడు వచ్చునప్పటికి మగపిల్లలకు మాత్రము శ్రద్ధగా విద్యాభ్యాసము చేయింప ప్రారంబించెడు నాచార మిప్పటి