పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నంతలో నేనచటికి వత్తును." మంగలి "బనబీరు డింతలో నిచటికి రాగలడు. వచ్చువర కిచట రాజపుత్రుడు లేకుండెనేని తక్షణము చారులచే వెతకించి పిల్లని చెప్పించును. అటులైన రాజపుత్రుని ప్రాణములను మనము కాపాడనేరము." పన్నా కొంచెము యోచించి మిగుల గాంభీర్యముగా "ఇందు కంతగా విచారింప నేల? వా డిచటికి వచ్చినయెడల రాజపుత్రు డిచట లేడనుమాటనే వానికి దెలియనియ్యను. రాజబాలుని నగలను, బట్టలను నా బిడ్డనికి నలంకరించి యా పక్కమీదనే పరుండ బెట్టెదను! నాపుత్రుని మరణమువలన మేవాడదేశపురాజును, మా ప్రభుడును నగు నీ బాలుడు రక్షింపబడును. కాన నా కదియే పరమ సమ్మతము" పన్నా దృడ నిశ్చయముగా బలికిన వాక్యములనువిని, యా నాపితుడు మిగుల నాశ్చర్యముతో నేమియు ననక నిలువబడి యుండెను. ఇంతలో పన్నా రాజపుత్రుని నొక తట్టలో నునిచి, పైన పుల్లాకులు, పెంట మొదలయినవి పోసి, యాతట్ట త్వరగా గొనిచెనమని యా సేవకుని తొందరపరుపసాగెను. దీని నంతను గని పన్నా ధైర్యమునకును, రాజభక్తికి వింతపడి దానియం దధికదయగలవాడై యాభృత్యుడు "పన్నా! నీవింత సాహసకార్య మేల చేసెదవు? ఇంకను నీ మనంబునం దించుక విచారింపుము," పన్నా! "విచారింప వలసిన దేమున్నది? నా కర్తవ్యము నేను చేయుటకు దగిన విచారము చేసినాను. నీవిట్టి యాటంకములనే చెప్పుచు నిచట నాలస్యము సేయకు."