పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంబీర్యము, బుద్ధికౌశలము, మున్నగు గుణగణములచే మిక్కిలి సత్కీర్తి గాంచెను. ఆధ్యాత్మికవిషయజ్ఞయు, సాధ్వీగుణభాసితయునగు గంగమాంబ యను విజ్ఞానవతి యీ యన సహధర్మచారిణి. గుణనిధి యగు నీ మిథునమునకు సముద్రునకు లక్ష్మీ కళానిధులవలె గ్రీ.శ. 1874 సం||న నొక కుమారీమణియు, నాపిమ్మట నొక కుమారరత్నము నుదయించిరి. ఈ యిరువురిలో నగ్రజయెయన యచ్చమాంబగారు, అచ్చమాంబగారి జన్మస్థానము మాత్రము మన దేశాచారము ననుసరించి ఆమె తల్లి పుట్టినింటివా రప్పుడువాసము చేయుచున్న నందిగామ యయ్యెను. ఈ నందిగామ యను గ్రామము కృష్ణామండలములోనిదే. ఈమె మాతామహుల నివాసస్థల మా తాలూకాలోని కంచెల యను గ్రామమైనప్పటికీ, నీమె మాతామహు లప్పు డచ్చటి జమీందారుల పనిమీద నచ్చట నుండుట తటస్థించినందున నీమె జననస్థల మది యయ్యెను.

మల్లెపువ్వు పుట్టింతోడనే వాసింప మొదలు పెట్టి యట్లు, మన యచ్చమాంబగారిలో కడుబాల్యమునాటనుండియు మిక్కిలిగా క్షమాగుణంబు, అనుకరణశక్తి, దీనవత్సలత మున్నుగాగల సుగుణగణంబులు బొడసూపుచుచుండెను. పెద్దవారు చేయుచుండెడు చాతుర్యములగు ననేక కార్యములను శ్రద్ధగా గ్రహించుచు, జాకచక్యముతో దానుగూడ నట్టి పెద్దపనుల జేయుట కీమె బాల్యమందే ప్రయత్నించు చుండెడిదట! చెలులతో నాటలాడెడు వేళలందుగాని, యితర సమయములందు గాని, సాధారణముగా దన కెట్టి బాధ కల్గినను దాను లోలోన సహించుచునే యుండెడిది గాని, పెద్దవారితో జెప్పి బేలవడి వాపోవుట యీమె యెరుగదు. ఇందుకొక చిన్ని దృష్టాంతము జెప్పెదను. ఈమె యైదారు సంవత్సరముల పిల్లగానుండినప్పుడొక్క నాడీమెను బెద్ద తేలొకటి కుట్టెను. అనేకమంది పెద్దవారు సైతము వృశ్చికస్పర్శ తగలగానే యోర్పుచాలక గుట్టువీడి రోదనముచేయుచు జుట్టుపట్టులవారిని బోగుచేతురు కదా; అట్టి తేలు నొవ్వబొడిచినను నాబాలికా శిరోమణి కిమ్మనక యా బాధనంతను లోలోన నణచుకొనుచు వారు తమంతవచ్చి తెలిసికొనునంతకు నింటిలోని పెద్దవారికైనను దెలియనీయకుండెను. మరియు నీమెకు జిన్నతనమున నాటపాటలు మున్నగువానికి దల్లిదండ్రాదు లిచ్చుచుండెడి సొమ్ము దనస్వంతమునకు గర్చుబెట్టక సదా దీనులకు బీదలకు నిచ్చుచుండెడిదట. ఇత్యాది