పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అశ్వములపై తానును, భర్తయు నెక్కి యా సంగ్రామపు సందడిలోనుండి తప్పించుకొని క్షణములో చితురు ప్రవేశించెను. ఇచట జోరాసింహుడు సైన్యాధిపత్యము స్వీకరించి యా తురకల నోడించెను. కాని యర్జున తుల్యుడగు గోరాసింహుడును, నాతని పుత్రుడగు బాదలుడును ఆ యుద్ధమునందు మృతులగుటవలన రజపూతులకు విజయానందమంతగా రుచింప దయ్యెను. అల్లా ఉద్దీను పరాజయమునకు బిసిబిల్లాయనుచు దనసైనికులతో డిల్లీమార్గమునకు దరలిపోయెను.

ఆ యుద్ధానంతరము మరికొంతకాలమునకు డిల్లీపతి విశేషసైన్యముతో మరల చితురుపై దండువెడలెను. ఈ తడవ చితురునందు శూరులు లేనందున రజపూతులకు విజయాశ యంతగా లేకయుండెను. కాని, యావీరు లంతటితో నిరాశ నొందియుండక ప్రాణములకు దెగించి శత్రువులతో బోరాడా దొడగిరి. అట్టి సమయమునందొక కారణమువలన నారజపూతులకు జయము దొరకదని నిశ్చయముగా దోచెను. అది యేదియనగా నా యుద్ధము జరుగునపు డొకదినమురాత్రి గ్రామదేవత భీమసింహుని స్వప్నమునందగుపడి "నా కతి దాహముగా నున్నది. ఈ దాహము పండ్రెండుగురు రాజుల రక్తము త్రాగినగాని తీరద"ని చెప్పెనట. అదేప్రకారము భీమసింహుని పుత్రులు పదునొకండుగురు శత్రువులతోడ బోరిహతులయిరి. అంతటితోనైనను రజపూతులు ధైర్యమును విడువక పురమునంగల పురుషులందరును వైరులతోడంబోరి స్వర్గసుఖమంద నిశ్చయించిరి. అంత వారందరు సిసోదియా