పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖనా

'విద్యచే శాశ్వతంబుగ వినుతి కెక్కు'

పూర్వకాలమునందు ఖనా యనుస్త్రీ జ్యోతిశ్శాస్త్రము నందధిక ప్రవీణురాలై యుండెను. ఆమె చేసిన కవిత్వ మా బాల వృద్ధుల కధిక ప్రియముగా నుండెననియు ఖ్యాతి గలదు. కాని మన దేశమునందు చరిత్రములు వ్రాయు వాడుక లేనందున నామె చరిత్రము సవిస్తరముగా నెచ్చటను దొరకలేదు. ఇందున కెంతయుం జింతిల్లవలసి యున్నది. ఈమె తల్లిదండ్రు లెవ్వరో తెలియదు. కాని యీమె జననిజనకులు బాల్యమునందే మృతి నొందినందువలన నీమె నెవడో యనార్యుడు పెంచుకొని యతడే యామెకు జ్యోతిషవిద్య నేర్పెనని యొక వింతకథ జెప్పెదరు. ప్రాచీనకాలమునం దార్యులకంటె ననార్యులే జ్యోతిషము నందు విశేష పాండిత్యము గలిగియుండిరని యందురు. ఖనా కుశాగ్రబుద్ధిగలదైనందున నితర బాలికలవలె నాటలతో గాలము గడపక తన పెంపుడుతండ్రియొద్ద స్వల్పకాలములోనే సంపూర్ణ జ్యోతిశ్శాస్త్రము నభ్యసించెనట! ఆ పెంపుడుతండ్రి ఈమె బుద్ధి కెంతయు మెచ్చి తనకు వచ్చినవిద్యయంతయు నామెకు సాంగోపాంగముగా నేర్పెను. ఇట్లు పురుషులకు సహితము దుర్లభమైన గణిత జ్యోతిషము లీమెకు గరతలామలకము లయ్యెను.

ఖనా వసియించెడి గ్రామము నందే మిహిరుడను బ్రాహ్మణ చిన్నవా డొక డనార్యులచే బెంపబడెను. పెంపుడు