పుట:Abaddhala veta revised.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుంది. మా పిల్లలు, మా యిష్టం, ఏమైనా చేసుకుంటాం, కొడతాం, తిడతాం, పెడతాం, పనిచేయిస్తాం మా యిష్టం వచ్చినట్లు దండం పెట్టిస్తాం అని తల్లిదండ్రులు అంటారు. మా పిల్లల్ని మా యిష్టం వచ్చినట్లు పెంచుకునే హక్కు లేదా అంటారు.

తల్లిదండ్రులకు నెమ్మదిగా నచ్చజెప్పడంలోనే పిల్లల హక్కుల సమస్య ఎదురౌతుంది.

పుట్టిన దగ్గరనుండి చనిపోయే వరకూ పరోక్షంగా, ప్రత్యక్షంగా అదుపుచేసే మతం వుంది. తల్లిదండ్రులు మతవిశ్వాసంతో పెరిగి, అదే మంచిదనుకొని, తమ పిల్లలకూ తమ నమ్మకాలు, విశ్వాసాలు అంటగడతారు. పేరు పెట్టడం నుండి అనేక క్రతువులు, మతపరంగా సాగిస్తారు. ఇందులో పురోహితులు కీలకపాత్ర వహిస్తారు.

తల్లిదండ్రులు ఏ మతానికి, కులానికి, జాతికి, దేశానికి చెందినా వారైతే, అవే పిల్లలకు వంశపారంపర్య ఆస్తిగా అందిస్తారు. కనుక హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు కొనసాగుతున్నారు. అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, రెడ్డి, కాపు, మాల, మాదిగ కులాలు పిల్లలకు అంటుకుంటున్నాయి. ఇక్కడే పిల్లలకు స్వేచ్ఛ అవసరం, అదే కష్టమైన పని.

కొన్ని విషయాలు పెద్దల పరిధిలోనివి. సెక్స్, రాజకీయం అందుకు ఉదాహరణలు. అందుకే పెళ్ళికి యుక్తవయస్సు రావాలన్నారు. రాజకీయంగా ఓటు హక్కుకు 18 ఏళ్ళు వుండాలన్నారు. అందుకు తల్లిదండ్రులకు అభ్యంతరం లేదు. చిన్న పిల్లలకు ఓటు కావాలని, లైంగిక చర్య కావాలని, పెళ్ళిళ్ళు కావాలని తల్లిదండ్రులు అనడం లేదు. అలాంటిదే మరొక పరిధి వుంది. అదే మతం, భక్తి విశ్వాసాలు పెద్దలకు సంబంధించిన నమ్మకం. పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత వారిష్టమొచ్చిన మతాన్ని స్వీకరిస్తారు, లేదా నిరాకరిస్తారు. ఈ లోగా వారు తమ చదువులో విషయం తెలుసుకుంటారు. మూఢంగా నమ్మమనడానికీ, బడిలో అడిగి తెలుసుకోడానికి చాలా తేడా వుంది. అడిగి తెలుసుకోవడం, పాఠాలలో శాస్త్రీయంగా మతాన్ని, సెక్సును, రాజకీయాల్ని గ్రహించడానికీ తేడావుంది.

ఈ విషయం చాల దుర్లభమైంది. తల్లిదండ్రుల్ని ఒప్పించడం చాల కష్టం. చిన్నప్పుడే బలవంతంగా ముస్లింలు తమ పిల్లల్ని మసీదులకు తీసుకెళ్ళి నిర్భందంగా కొరాన్ అంతా వల్లెవేయిస్తున్నారు. క్రైస్తవులు దేవాలయాలలో బైబిల్ నూరిపోసి పిల్లలకు సండే స్కూల్స్ ద్వారా మూఢనమ్మకాలు నూరిపోస్తున్నారు. హిందువులు తమ పిల్లల పక్షాన మొక్కుబడులు చేసి, గుండ్లు కొట్టించి, వినాయకుడికి దండాలు పెట్టిస్తున్నారు. ఈ విధంగా అన్ని మతాల వారు చిన్న పిల్లల్ని ఆయా మతాల నమ్మకాలలో ముంచి తేల్చుతున్నారు. పిల్లల స్వేచ్ఛను అరికడుతున్నారు. ప్రశ్నించి తెలుసుకునే స్వభావాన్ని అణిచిపెడుతున్నారు. భక్తి పేరిట భయం ప్రవేశపెడుతున్నారు. పాపం, నరకం, దైవం, దయ్యం అనే బూచి చూపి అన్వేషణ ఆపుతున్నారు.