పుట:Abaddhala veta revised.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్వసిద్ధాంతసార సంగ్రహం, ప్రబోధ చంద్రోదయం మొదలైన వాటిలో లోకాయత ప్రస్తావనలున్నాయి. లోకాయత దృష్టిలో మానవులందరూ సమానం. నీతిగా ఉండటానికి దైవం అక్కరలేదు. యజ్ఞయాగాదులను తీవ్రంగా ఖండించారు. ఐతే పురోహితవర్గం ఈ వాదాన్ని ప్రచారంలోకి రానీయకుండా మట్టుపెట్టే వరకూ నిద్రపోలేదు. కనుక మానవతావాద వ్యాప్తి అక్కడే ఆగిపోయింది.

తరువాత పురోహిత వర్గానికి ఎదురు తిరిగి రాజుల అండతో, ప్రాపకంతో క్షత్రియులుగా జైన,బౌద్ధ సిద్ధాంతకర్తలు ప్రచారంలోకి వచ్చారు. జైనులు యజ్ఞయాగాదులను ఖండించినా,బ్రాహ్మణులను వ్యతిరేకించినా, కింది కులాలవారిని పట్టించుకోనే లేదు. స్త్రీలను పురుషులతో సమానంగా జైనతత్త్వం చూడలేకపోయింది. 1848లో అహమ్మదాబాదు వద్ద నిర్మించిన సేట్ హత్తిసింహ జైన దేవాలయంలో కుక్కలూ తక్కువ కులాలవారు ప్రవేశించరాదని బయట బోర్డు పెట్టారంటే, మానవుల పట్ల వారి ధోరణి అవగహన చేసుకోవచ్చు. జైనమతాన్ని అవలంబించి, పాటించే మార్వాడీ వర్తకులు చాలామంది ఆవుల్ని పోషిస్తూ, పూజిస్తూ, మనుషుల్ని చక్రవడ్డీలతో రక్తం పీలుస్తారంటారు.

బుద్ధుడు కుల విచక్షణను భిక్షువులు పాటించరాదన్నారు. ఐతే భిక్షువులుగా మారని వారిలోకులం కొనసాగటానికి బుద్ధుడు వ్యతిరేకించలేదు. బ్రాహ్మణులను తీవ్రంగా వ్యతిరేకించిన బుద్ధుడు క్షత్రియుల ప్రాపకంతో తన వాదాన్ని ప్రచారం చేసుకోగలిగాడంటారు. కులాన్ని ఒక వ్యవస్థగా అట్టిపెట్టరాదనీ, అది తొలగించాలనీ బుద్ధుడు చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. అంతేకాక బుద్ధుడు కూడా స్త్రీల పట్ల చిన్నచూపే చూశారు. శౌక్యశాఖకు చెందిన మహాప్రజాపతి భిక్షులలో చేరటానికి అంగీకారం కుదరనప్పుడు అయిష్టంగానే బుద్ధుడు ఆమెను చేర్చుకున్నాడు. స్త్రీలను చేర్చుకుంటే తన వ్యవస్థ అట్టేకాలం ఉండదని కూడా అతను అభిప్రాయపడ్డాడు.

భగవద్గీత చాలా స్పష్టంగా కులాలు,వర్ణాలు,భగవంతుని సృష్టి అనీ,వ్యక్తి స్వభావాన్ని బట్టి, వృత్తిని బట్టి అవి వచ్చాయని పేర్కొన్నది. మహాభారతం నాటికి వర్ణాశ్రమ ధర్మాలు బాగా పాతుకపోయి కులాల హెచ్చుతగ్గులు అల్లుకుపోయాయి. ఎక్కడో చెదురుమదురుగా తప్ప కులవ్యవస్థను వ్యతిరేకించిన సూచనలు లేవు. ప్రతిదీ దైవానికి అంటగట్టి కులవ్యవస్థను సమర్ధించినందువలన మానవవిలువలు పూర్తిగా మృగ్యమైపోయాయి. ఆ తరువాత, అంతకుముందూకూడా వచ్చిన ధర్మశాస్త్రాలూ, సంహితలూ, శుక్రనీతిసారం, మొదలైనవన్నీ భగవంతుని పేరిట కులవ్యవస్థను, శిక్షలను బాగా కట్టుదిట్టం చేసి బిగించివేసాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం కూడా హిట్లర్ నాజీయిజం, ముసోలినీ ఫాసిజానికి మించిపోయిన శిక్షలను పేర్కొన్నది. కులాంతర వివాహాలు నిషిద్ధం అన్నారు. కుల కట్టుబాట్లను దాటినవారినీ, వ్యతిరేకించిన వారినీ శిక్షించడానికి ఎన్నో ఆంక్షలు పెట్టారు. మొత్తం మీద దోపిడీవ్యవస్థ బలపడి కొందరు అగ్రకులాలుగానూ,మరికొందరు నీచకులాలుగానూ వర్గీకరణ పొందారు. ఛండాలులూ,