పుట:Abaddhala veta revised.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదాలకు వ్యతిరేకంగా, అంటే పురోహితవర్గాలకు భిన్నంగా, క్షత్రియులు ఉపనిషత్తులను ప్రోత్సహించారంటారు.

వేదాలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదు. వాటిని అపౌరుషేయాలనీ, ప్రమాణాలనీ పేర్కొన్నారు. మతాన్ని సంస్కరించాలనే వారంతా వేదప్రమాణాన్ని అంగీకరించే ముందుకు సాగారు. కనుక మనదేశంలో మత-మానవతావాద చర్చకు వేదప్రాధాన్యతను గుర్తించక తప్పదు. వేదకాలంలో సహజ స్వభావ వాదాలకు నిదర్శనాలున్నవి. కాని ఆ వాదాలు ప్రామాణికుల పెత్తందారీతనంలో సమసిపోయాయి. కనుక వేదకాలంలో తలెత్తబోయిన మానవతావాదాన్ని మొగ్గలోనే తుంచివేసినందున మళ్ళీ అది ఏనాడూ బలపడలేకపోయింది. వేదకాలంలో పురోహితవర్గాలు తమలో తాము కలహించుకొని దేవుళ్లకు వాటిని ఆపాదించారు. తాము సృష్టించిన దేవుళ్లను శక్తివంతంగా అట్టిపెట్టాలని చేసిన ప్రయత్నాలలో ఇంద్రుడూ,వరుణుడు, అగ్నిరుద్రుడు, ప్రజాపతి పైకీ,క్రిందికీ స్థాన భ్రష్టం పొందుతూ రావడం ఈ పురోహితవర్గాల లీల మాత్రమే. కుక్కను చంపాలంటే పిచ్చెక్కినట్లు పేర్కొనాలి. మానవతను చంపాలంటే దైవం పేరు అడ్డం పెట్టుకోవాలి. వేదకాలంలో ఇదే జరిగింది. గార్గి, మైత్రేయి వంటి ఆలోచనాపరులు తార్కికంగా దైవాన్ని ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించారు. వేదప్రమాణానికి విలువ అలాంటిది. ప్రమాణం అంటే ప్రశ్నించ వీలుకానిది. ఆధారరహితమైనది. అధికారానికి ఆయువుపట్టు. మన సంస్కృతికీ, విలువలకీ ప్రాచీనకాలంలో ఆ విధంగా దోషపూరిత పునాదులు పడ్డాయి. తరువాత నిర్మించిన మతశాఖలూ, వచ్చిన సంస్కరణలూ, అన్నీ ఈ అధికారిక ప్రమాణాన్ని అడ్డం పెట్టుకుని పుట్టుకొచ్చినవే. మానసికంగా మన వెనుకబడినతనానికి ప్రాతిపదికలు వేదకాలంలోనే జన్మించాయి. మానవతకు అక్కడే పురుగుపట్టింది. ఆ తరువాత పరిణామాలు ఎలా వచ్చాయో పరిశీలిద్దాం.

భారతదేశం ప్రాచీన కాలంలో యాజ్ఞవల్క్యునికి బదులు ఉద్దాలకుని అనుసరించినట్లయితే, దేశం వైజ్ఞానికంగా ముందుకు వెళ్లేదని ఒక భావన ఉన్నది. ఉద్దాలకుడు ప్రశ్నించమన్నాడు.యాజ్ఞవల్క్యుడు నమ్మమన్నాడు.

ఉపనిషత్తులు వేదాల అనంతరం వచ్చినవి. వాటిలో భిన్నత్వం గోచరిస్తుంది. షుమారు క్రీస్తుపూర్వం ఐదు వందల సంవత్సర ప్రాంతంలో అవి వ్రాసినట్టు చెప్పవచ్చు. ఉపనిషత్తులలో అక్కడక్కడా స్వేచ్చాపూరిత ఆలోచనకు నాంది పలికిన లక్షణాలు కనిపిస్తాయి. పోతే, ఉపనిషత్తులను వేదాలతో సమానంగా అందరూ స్వీకరించటం లేదు, దయానందుడు వాటిని స్పష్టంగా నిరాకరించారు.

భారతదేశంలో ప్రప్రథమంగా మానవతా దృక్పధానికి స్పష్టమైన ఆలోచన చేసింది చార్వాకులనవచ్చు. దీనినే లోకాయత అని కూడా అంటారు. ఈ ఆలోచనాస్రవంతిని ఖండిస్తూ భారతీయ మతాలూ, చింతనాపరులూ చాలా చోట్ల ప్రస్తావన తెచ్చారు. సర్వదర్శన సంగ్రహం,