పుట:Abaddhala veta revised.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదుగురాడు మాట పాటియై ధరజెల్లు అన్న గొర్రెలమంద ధోరణిని మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తాయి. కొందరు అనుభవిస్తూ, ఇతరులను అణచివేస్తూ, అందుకు తగ్గట్టుగా, ధర్మం, కర్మం,దైవం అంటూ జనాన్ని మత్తులో అట్టిపెట్టి-కొత్తభావాలూ, ఆలోచనలూ తప్పు అని మతాలు చెబుతూ వచ్చాయి. ఇందుకు భిన్నంగా మానవతావాదం విజ్ఞాన పంధాను ఎంపిక చేసుకున్నది. ప్రవాహానికి ఎదురీదింది. దీని వలన సైంసు పుట్టింది. మానవ పురోగతికీ, నిరంతర అభ్యుదయానికి విజ్ఞానం తోడ్పడుతున్నది. ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పక్కదారులు పట్టించడానికి మతం ప్రయత్నిస్తూనే ఉన్నది. ఆ ప్రయత్నంలో ఓడిపోయి ఇప్పుడిప్పుడే మతం కూడా విజ్ఞాన పంధాలను అనుసరించి ఆవిర్భవించిందని చెపుతున్నారు. ఇందులోని ప్రమాదాన్ని వారు గ్రహించలేదు. విజ్ఞానం స్థిరమైనది కాదు. శాశ్వతమైనది కాదు. ఎప్పటికప్పుడు కొత్తవి కనిపెడుతూ, వాటిలోని దోషాలు సవరించుకుంటూ, అనంతంగా పయనిస్తూ ఉంటుంది. మతం కొన్ని ప్రమాణాలను అంటిపెట్టుకొని, అవి ప్రశ్నించటానికి వీలులేనివనీ, అధికారికంగా చాటుతుంది. కనుక మతం శాస్త్రీయమంటే రుజువుకు నిలబడాలని, లేకుంటే తృణీకరించాలని అర్థం. మానవతావాదం మాత్రమే అందుకు సిద్ధపడగలదు.

వ్యక్తికీ, సమాజానికీ ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మానవతావాదం కొన్ని విలువలనూ, ప్రమాణాలనూ రూపొందిస్తుంది. వాటిలో మార్పులు అవసరమైతే వెనుకాడదు. మతం దైవవిశ్వాసం పేరిట శాశ్వత విలువలనూ, ప్రమాణాలనూ బలవంతంగా మనుషులపై రుద్దుతుంది. మతస్తులు వాటిని మార్చుకోటానికి సిద్ధపడరు.

మానవతావాదం మనుషులను ఐక్యం చేస్తుంది. సహకరింపజేస్తుంది. స్వేచ్ఛకు విలువనిస్తుంది. మతం మనుషులను విభజిస్తుంది. ద్వేషాలను పెంచుతుంది. హింసను ప్రోత్సహిస్తుంది. ఇది చరిత్ర సత్యం. ఈ దృష్ట్యా మనదేశంలో మానవతావాదం ఎలా పరిణమించిందో దానికి అడ్డువచ్చిన శక్తులేమిటో పరిశీలిద్దాం.

మనదేశంలో క్రీస్తుపూర్వం 1500 సం॥కాలంనుండి ఆర్యుల రాకతో వేదాలు,ఉపనిషత్తులలో స్వేచ్ఛాపూరితమైన ఆలోచన సాగింది. వేదరచనలో ఇందుకు అనేక నిదర్శనాలు కనిపిస్తాయి. కాని ప్రప్రథమంగా శరీర రంగును బట్టి మనుషులను విభజించడం కూడా అప్పుడే ప్రారంభమైంది. ఆర్యులు ఉన్నతులనీ, క్షత్రియులు తక్కువవారనీ వాదన మొదలైంది. పురోహితవర్గం అనేక హక్కులను ఆపాదించుకొని మిగిలిన వారిని విచక్షణతో హీనంగా చూచారు. యజ్ఞం చేస్తే ఏ పాపమైనా పోతుందనీ, గోదానం చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పారు. పురోహిత వర్గం శూద్రులను బానిసలుగా స్వీకరించారు. దేవుళ్ళను విభజించి, పురోహితులకు వేరే దేవుళ్ళూ, మిగిలిన వారికి వేరే దేవుళ్ళూ అని పేర్కొన్నారు. ఈ విధంగా వేదకాలంలో పురోహితవర్గం దేశంలో మానవులను విభజించింది. క్షత్రియులు ఇందుకు ఎదురు తిరిగారు. అప్పట్లో కులవ్యవస్థ నేడున్నంత స్పష్టంగా లేకపోయినా బ్రాహ్మణ,క్షత్రియ విభజన మాత్రం స్పష్టంగానే ఉన్నది. ఒక విధంగా