పుట:Abaddhala veta revised.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అడిగారు. ఆయన వెంటనే చేతులు అటూఇటూతిప్పి విభేది యిచ్చాడు. సందేహవాది ఆశ్చర్యపోయి, ఎలా సాధ్యమైంది అని అడిగాడు. ప్రేమానంద్ వివరించాడు. విభూది వుండను చూపుడువేలు బొటనవేలు మధ్య పెట్టుకోవాలి. అలా వుంచి కూడా, నమస్కారం పెట్టవచ్చు. కరచాలనం చేయడం అలవాటు చేసుకోవచ్చు. తరువాత చేతిని అటూఇటూ తిప్పాలి. వేళ్ళ మధ్యవున్న విభూది వుండను అరచేతిలోకి తెచ్చి పొడిచేసి, కొంచెంగా భక్తులకు పంచాలి. బాబాలు చేసే పని యిదే పదార్థం లేకుండా, సృష్టి కాదు. బాబా దగ్గరకు వచ్చే భక్తులు అనుమానంతో ప్రశ్నించడానికి రారుగా? అందువలన బాబాచేసే ట్రిక్కులు, మాజిక్ లు భక్తులకు అద్భుతాలుగా కనిపిస్తాయి.

సువాసనవచ్చే విభూదిని గంజినీళ్ళలో కలిపి వుండలుచేసి అట్టిపెట్టుకుంటే యీ పని చేయవచ్చు. సాయిబాబా మొదలు శివానంద వరకూ ఏ బాబా చేసినా యింతే. లోగడ అబ్రహాం కోవూరు కూడా చంకలో నుండి ఒక గొట్టాన్ని లాల్చీలో అమర్చి,అందులో నుండి విభూది కావలసినంత తెప్పించేవాడు.

- హేతువాది, మార్చి, ఏప్రిల్,మే,జూన్ 1996
అయ్యప్పా, మనుషులే నీకు శరణం!

ప్రతి సంవత్సరం నవంబరు నుండి జనవరి వరకూ కేరళలోని శబరిమన కొండపైన అయ్యప్ప దర్శనార్ధం భక్తులు యాత్ర జరుపుకుంటారు. జనవరి 14న ఉత్సవానికి పరాకాష్ఠ, ఆఖరి రోజు కూడా ఆరోజు శబరిమల కొండకు పది కిలోమీటర్ల దూరానవున్న పొన్నంబల మేడు కొండపై సాయంత్రం ఆరున్నర నుండి ఆరు నలభై లోపు మూడు పర్యాయాలు మకరజ్యోతి వెలుగుతుంది. ఇది దైవికమనీ, మానవులకు ఈ ప్రదేశం అందుబాటులో ఉండదనీ చిరకాలంగా ఒక గాధ ప్రచారంలో ఉన్నది. ఆ వెలుగు కనిపించగానే భక్తులు గుండెలు బాదుకుంటూ, అయ్యప్పా శరణం అంటూ నినదిస్తారు.

ఈ జ్యోతి మానవులతో నిమిత్తం లేకుండా వెలుగుతున్నదా? అనేది హేతువాదులను కొంతకాలంగా వేధించిన సమస్య అయింది. పరిశోధన జరపాలని వారు కేరళలో తీవ్ర ప్రయత్నం చేశారు. ఇతే హేతువాదులను ఆ కొండపైకి పోకుండా పోలీసులు అటకాయించటమే కాక 1980లో లాఠీ చార్జీ కూడా చేశారు.

యుక్తివాది సంఘంవారు ఈ విషయ పరిశోధనకు సుకుమారన్ ధనువాచపురం, టి.యన్.బాబు అనే వారిని పురమాయించారు. వీరిద్దరకూ కొండపైకి ముందుగానే చేరుకున్నారు. వారికి పోలీసు జీపు కె.యల్.యఫ్.2676,కె.ఆర్.టి.2951 నంబరులో మరో జీపు, కేరళ విద్యుత్ బోర్డువారి జీపు కనిపించాయి. ఆ జీపులలో వచ్చిన వ్యక్తులు కొబ్బరికాయలు, అగరువత్తులు, కర్పూరపు పొట్లాలు పట్టుకొచ్చారు. దీనితో వెలుగు ఏ విధంగా వస్తున్నదీ తేలిపోయింది.