పుట:Abaddhala veta revised.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ రోజు ఏం జరుగుతుందోనని జనం ఎదురుచూస్తున్నారు. వేచివున్న జనాన్ని ఆదుకోడానికి కొందరు మంచినీళ్ళు అందిస్తున్నారు.

చివరకు స్వామీజీ రానే వచ్చారు. చిన్నప్రసంగం చేశారు. బాబాకు తెలుగు రాదు గనుక ఆయన ప్రవచనాల్ని శిష్యుడు తెలుగులో చెప్పారు.

మాటల అనంతరం బాబా అరచేతిలో కర్పూరం పెట్టుకొని, మంత్రాలు చదువుతూ వెలిగించారు. చూస్తుండగానే మండుతున్న కర్పూరాన్ని నోట్లో వేసుకున్నారు.

భక్తులంతా ఆశ్చర్యపోయారు. బాబా మామూలుగానే మాట్లాడారు. ఆయనకు నోరుకాలదా?

ఇంతలో హేతువాది ప్రేమానంద్ వచ్చాడు. నేనూ బాబావలె చేయగలనని చేతిలో కర్పూరపు ముద్ద వెలిగించి, నోట్లో వేసుకున్నాడు.

నిప్పు రావాలంటే ఆక్సిజన్ అవసరం. కర్పూరం వెలుగుతుండగా నోట్లో వేసుకొని, నోరు మూసుకుంటే ఆక్సిజన్ లేక ఆరిపోతుంది. నోట్లో కర్పూరపుముద్ద వేసుకొని నోరు మూసి గాలి బయటకు వదలాలి. మనం వదిలేది కార్బన్ డైయాక్సైడ్(బొగ్గుపులుసువాయువు). అది మంటను వెంటనే ఆర్పేస్తుంది. కాకుంటే నోట్లో వెలిగే కర్పూరపుముద్ద వున్నప్పుడు గాలి పీల్చకూడదు. పీల్చేది ఆక్సిజన్(ప్రాణవాయువు) గనుక,అది మంటను ఆర్పదు.

ప్రేమానంద్ వివరణతో బాబా ట్రిక్కు అందరికీ బట్టబయలు అయింది. అయినా భక్తులు కొత్త మహత్తులకు ఎదురుచూస్తున్నారు.

క్రీస్తుమహిమలు:

సువార్త కూటములు జరుగుతాయనే ప్రచారం విపరీతంగా సాగింది. మారుమూల గ్రామాల నుండి క్రైస్తవులు సందేశం వినడానికి చేరుకున్నారు.

అమెరికానుండి చాలా గొప్ప క్రైస్తవ ప్రచార బోధకుడు వచ్చాడట. ఆయన క్రీస్తు మహిమలు వివరిస్తాడట. అందువలన సువార్త కూటములకు ప్రత్యేకత సంతరిల్లింది.

ప్రార్థనలు చేసిన అనంతరం ఇంగ్లీషులో ఉపన్యాసం సాగింది. తెలుగులో అనువదించి ఒక పాస్టరు చెబుతున్నాడు. బైబిల్ చేతుల్లో పట్టుకొని మోకాళ్ళపై కూర్చున్న భక్తులు శ్రద్ధతో ఆలకిస్తున్నారు.

ఏసుక్రీస్తు ఒక పెళ్ళి సందర్భంగా వచ్చిన వారందరికీ చాలినంత ద్రాక్ష సారాయి(వైన్)ని నీళ్ళద్వారా అందించాడట. నీరు కాస్తా ద్రాక్ష సారాయిగా మార్చడానికి ఆరు రాతి కూజాలను వాడారట. అలాగే మరో సందర్భంలో 5 రొట్టెముక్కల్ని వేలదిమందికి క్రీస్తు పంచి అద్భుతాన్ని చూపాడట. బైబిల్ ఆధారంగా యీ విషయాల్ని ఆయన వివరించాడు.