పుట:Abaddhala veta revised.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏమిటి విచిత్రం? హేతువాది ప్రేమానంద్ ను భక్తులు అడిగారు. హేతువాదులు కార్యకారణ అణ్వేషణ సాగించారు. ప్రేమానంద్ నిశిత పరిసీలనలో తేలిన అంశం. రెండు గద్దలను పట్టుకొని వాటికి యిచ్చే ఆహారంలో నల్లమందు కలిపారు. అలా నల్లమందుకు(ఓపియం) అలవాటుపడిన రెండు పక్షులు రోజూ రావడం ఆరంభించి, అలవాటు చేసుకున్నాయి. అలవాటు అయిన తరువాత పక్షుల్ని వదిలేసినా తప్పనిసరిగా వస్తున్నాయి.

పురాణకథలు ఎన్ని చెప్పినా అసలు రహస్యం యిది. భక్తులు ఎన్ని కానుకలు సమర్పించినా వాస్తవం యిదే.

తాయెత్తులు,తాంత్రికుల చిత్రాలు:

మన జనాల్లో, చదువుకున్నవాళ్ళతో సహా తాయెత్తులపై నమ్మకాలు ఎక్కువ. ఈ తాయెత్తులు అనేక రూపాలలో వుంటాయి. రుద్రాక్షలు, వెండి,రాగి బొమ్మలు, ఉంగరాలు,మాలలు ఇంకా ఎన్నో వున్నాయి. కొందరు చిన్న కడియాలు చేతికి, కాలికి ధరిస్తారు. రాగి కడియాల వలన శరీరంపై ప్రభావం వుంటుందని నమ్ముతారు. అప్పుడప్పుడూ ఇళ్ళకు వచ్చే బాబాలు, తాంత్రికులు తాయెత్తులు యిస్తుంటారు. అవి ధరిస్తే అశుభాలు పోతాయని, మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో కాళీమాత వంటి దేవతల ఆగ్రహం పోగొట్టడానికి తాయెత్తులు ధరించడమేగాక, రక్తాన్ని అర్పించే క్రతువులు చేస్తుంటారు.

తాంత్రికులు తాయెత్తు మహిమ చూపే తీరులు ఎన్నో వున్నాయి. రాగి బొమ్మను ఎమిరి పేపర్ తో శుభ్రంచేసి మెర్క్యురస్ నైట్రేట్ ద్రావణంలో ముంచుతారు. మెత్తని వస్త్రంతో బాగా రుద్దితే, వెండివలె కనిపిస్తుంది. అల్యూమినియం ఫాయిల్ గట్టిగాచుట్టి భక్తుడికి ఇస్తారు. దానిపై ఏకాగ్రతతో ధ్యానం చేయమంటారు. పిడికిలి గట్టిగా బిగించి తాయెత్తు పట్టుకోమంటారు. కాసేపట్లో రసాయనిక మార్పువలన వేడెక్కి వెండి ఫాయిల్ తొలగించి చూస్తే, విభూతి వంటి పౌడర్ కనిపిస్తుంది. అది కళ్ళకు అద్దుకుంటారు.

ఇంట్లో శాంతి జరపడానికి తాంత్రికులు,మాంత్రికులు గమ్మత్తు పనులు చేసి తమ ముడుపులు వసూలు చేసుకుంటారు. యజ్ఞగుండం ఏర్పరచి కట్టెలలో నెయ్యి వేస్తారు. ఒక ప్లేటులో పొటాషియం పర్మాంగనేటు బొట్లు వేసి అందులో నీళ్లుపోస్తారు. రక్తంవలె కనిపించే ఆ నీటిప్లేటులో దీపం వెలిగించి, మధ్యలో పెట్టి, దానిపై ఒక మూత వేస్తారు. పాత్రలోని ఆక్సిజన్ అయిపోగానే దీపం ఆరిపోతుంది. నీటిలో కార్బన్ డయాక్సైడ్ కలిసి, శూన్యప్రదేశం ఏర్పడగానే పాత్రలోకి నీరు పీల్చుకుంటుంది. ప్లేటులోని నీరు(రక్తం వలె కనిపించేది) పాత్రలోనికి పోగానే, దేవత శాంతించినట్లు వ్యాఖ్యానించి, డబ్బు వసూలు చేసుకొని మాంత్రికుడు నిష్క్రమిస్తాడు. గృహస్థులు తృప్తిపడతాడు. మాంత్రికుడు ఏంచేసాడో హేతువాది ప్రేమానంద్ వివరిస్తాడు. అప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది.