పుట:Abaddhala veta revised.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉన్నట్లుండి యింట్లో బట్టలనుండి నిప్పు వస్తుంది. ఆరుబయట ఆరవేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుంది. ఇంకేముంది? ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు. శాంతి చేయించమంటారు. కొన్నాళ్లు యిల్లు పాడుబెట్టమంటారు. ఎవరో చేతబడి చేయించారంటారు. దోషం పోవడానికి ఏమేమి చెయ్యాలో చెబుతారు.

ఇంటి బయట బట్టలు ఆరేయండి. పచ్చ ఫాస్ఫరస్ ఒక పాలు, కార్బన్ డైసల్ఫైడు ఆరు పాళ్లు కలపండి. కొద్దిగా బట్టలపై చల్లండి అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకొంటుంది. ఇంట్లో అలమరలో పెట్టిన దుస్తులలోనూ యీ ద్రావకం చల్లవచ్చు. యింటిలోని వారిని ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తుంటారు. జాగ్రత్తగా కనిపెడితే ఎవరు చేస్తున్నదీ అర్థమవుతుంది.

సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మూలకారణం పరిశీలించకుండా, మతపరమైన మూఢనమ్మకాల వలన భూతవైద్యుల్ని,సోది చెప్పేవారిని పిలుస్తుంటారు.

ఏసుక్రీస్తు మహిమలు

మహత్తుల పేరిట జనాన్ని ఆకర్షించడం హిందువుల సొత్తు మాత్రమే కాదు. అన్ని మతాల్లోనూ యివి కొద్దో గొప్పో వున్నాయి. క్రైస్తవులలో కొన్ని శాఖలు మహిమలను ఖండిస్తాయి. మరికొన్ని తటస్థ వైఖరితో వున్నాయి. కేథలిక్ లు, ఎవాంజలిక్ లు,మరికొందరు మహత్తులున్నాయంటారు. బైబిల్ మహిమల ప్రస్తావన వుంది.

ప్రపంచంలో క్రైస్తవ మహిమలు జరగడం, వాటిని పోప్ గుర్తించడం ఒక చరిత్రగా కొన్ని వందల సంవత్సరాల నుండీ జరుగుతున్నది. మేరీమాత విగ్రహం కన్నీళ్ళు పెట్టడం, క్రీస్తు సమాధిపై కప్పిన బట్టపై క్రీస్తుముద్ర పడిందనడం, ఆఫ్రికాలో ఎడారి ఇసుకలో క్రీస్తు పాదాల ఆనవాళ్ళు వున్నాయనడం వింతగా చెబుతారు.

క్రైస్తవ మఠాధిపతులు, ఫాదరీలు అప్పుడప్పుడు కొన్ని మహిమలు చేసి ప్రచారంలోకి తెస్తుంటారు. హేతువాదులు జేమ్స్ రాండి, ప్రేమానంద్ యిలాంటివి బయటపెట్టారు. క్రైస్తవమత ప్రచారకులు అత్యంత ఆధునాతన టి.వి.రేడియో మొదలైన ప్రసార సాధనాలు వాడుతున్నారు.

దేవాలయంలో కొవ్వొత్తిని ఫాస్ఫరస్ ద్రావణంలో ముంచి నిలబెడతారు. ద్రావకం తడి వున్నంతసేపూ ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత తడి ఆరగానే కొవ్వొత్తి అంటుకుంటుంది. అదొక గొప్ప క్రీస్తుమహిమగా చూపుతారు.

మరో కొవ్వొత్తి స్టాండులో కొవ్వొత్తి ప్రక్కన క్రోమిక్ యాసిడ్ స్ఫటికాలు వేయాలి. ఇంకో కొవ్వొత్తిని ఆల్కహాలులో ముంచాలి. ఆల్కహాలులో ముంచిన కొవ్వొత్తిలో క్రోమిక్ యాసిడ్ స్ఫటికాలున్న కొవ్వొత్తిని తాకిస్తే రెండూ వెలుగుతాయి.