పుట:Abaddhala veta revised.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మానవ హక్కులు అమలుపరచకుండా దైవం పేరిట అడ్డుపడుతున్న క్రైస్తవాన్ని హేతువాదులు సైన్స్ ద్వారా ఎదుర్కొంటున్నారు. సైన్స్ కూడా తమదేనని చెప్పిన క్రైస్తవులు అపహాస్యం పాలయ్యారు. అమెరికాలో 90% దైవంలో నమ్మకం వున్నవారైనా, ఫలానా దేవుడని గాని ప్రార్థిస్తే వరాలిస్తాడని గాని నమ్మకం లేనివారు 30% వున్నారట.

భవిష్యత్తు జోస్యాలతో బైబిల్ ను అడ్డం పెట్టుకొని, 2 వేల సంవత్సరంలో విశ్వం అంతమౌతుందని చెప్పే క్రైస్తవులూ వున్నారు. ఈ తేదీలు సమయానుకూలంగా మారుస్తుంటారు.

భవిష్యత్తు చెప్పగలిగిన క్రైస్తవ నాయకులు, ప్రజల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి బదులు లాటరీ టిక్కెట్లు కొని, గెలిచే నంబర్లు తెలుసుకొని చూపితే, సులభంగా కోటీశ్వరులౌతారుగదా అని ఛార్లస్ ఫాల్కనర్ అడిగాడు. బహుశా అతీంద్రియ శక్తులతో భవిష్యత్తు చూడగలమనే వారందరికీ యీ ప్రశ్న వర్తిస్తుంది.

నమ్మకస్తులు సులభంగా మారరు. ప్రశ్నలు, చర్చలు, ఆలోచన యివన్నీ చిత్రహింసలు నమ్మకానికి బుర్ర తాకట్టు పెడితే హాయిగా వుంటుంది. అందుకే సైన్సు ఇంత పెరిగినా నమ్మకస్తులు చలనం లేకుండా సాగిపోతున్నారు. బైబిల్ కు ఆదరణ సన్నగిల్లలేదు!

- హేతువాది, ఆగస్టు 1994
అమెరికాలో ఆధ్యాత్మిక వ్యాపారం!
ఇండియా ఎగుమతులు!

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆధ్యాత్మిక వ్యాపారం విచ్చలవిడిగా, యధేచ్ఛగా సాగిపోతున్నది. పెట్టుబడిలేని సంపాదనగా మనుషుల బలహీనతలే ఆధారంగా, భక్తి పేరిట దోపిడీ పెరిగిపోతున్నది. ఈ రంగంలో భారతదేశం నుండి కొందరు తమ విశ్వాసాలను అమెరికాలో అమ్ముకొని విలాస జీవితాల్ని గడుపుతున్నారు.

అమెరికాలో సంవత్సరంన్నర కాలంపాటు పరిశీలించిన అనంతరం,600 మతశాఖలు ఆధ్యాత్మిక వ్యాపారంలో వున్నట్లు గమనించాను. ఇందులో చిన్న, పెద్ద స్వాములు, బాబాలు వున్నారు. వివిధ దేశాల నుండి అమెరికా చేరుకున్న ఆయా మతగురువులు సొంత దుకాణాలు పెట్టుకొని, తమ దేశస్తులకే పరిమితమై గుట్టుగా దోపిడిలో నిమగ్నులై వున్నారు. ఇందులో సుమారు 75 శాఖలు మహత్తులు, మాజిక్ లు, మోసాలు, భీభత్సాలు, చికిత్సలు, భయానక వాతావరణం సృష్టించి తమ వారిని ఆకట్టుకొని, పీల్చి పిప్పి చేస్తున్నారు. మతస్వేచ్ఛ పేరిట వీరు చేసే ఆగడాలు యిన్నీ అన్నీ కాదు. అందులో కొన్ని రహస్య కార్యకలాపాలలో నిమగ్నమైనాయి. విషాదాంతంగా విపరీత సంఘటనలు బయటపడినప్పుడే వాటి గుట్టు జనానికి తెలుస్తున్నది.