పుట:Abaddhala veta revised.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మతాన్ని వ్యక్తిగతంగా అట్టిపెడితేనే సెక్యులరిజం అవుతుంది. ఎవరి మతం వారిది. ఎవరి నమ్మకాలు వారివి. ప్రభుత్వం అందరిదీ. కనుక ప్రభుత్వంలో వున్నవారు తమ వ్యక్తిగత నమ్మకాలను ప్రచారం చేయడం గాని, ఇతరులపై రుద్దడంగాని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడం గానీ కూడదు. అంటే మతాన్ని బజార్లోకి ఈడ్చుక రాకూడదని సారాంశం.

సెక్యులరిజాన్ని యీ విధంగా అమలు జరపకపోవడం వలన అన్ని అనర్థాలు వచ్చాయి. ఇంకా వస్తాయి. దేశంలో తరచు జరిగే హిందూ-ముస్లిం కలహాలు,హిందువులలోని శాఖలలో తగాదాలు, సిక్కుల ఖలిస్తాన్ ఉద్యమం, ఇవన్నీ ప్రభుత్వ సెక్యులర్ వైఖరివలన జనించినవే.

అన్ని మతాలు ఒకటికాదు. మతాలన్నీ ఒకే విషయాన్ని బోధించడం లేదు. దేవుడు ఒక్కడు కాదు. ఎవరి మతానికున్న దేవుడు ఆ మతానికి గొప్ప. అన్ని మతాలు ఒకటే అయితే ఇన్ని మతాలు పుట్టేవేకాదు. ఒక మతాన్ని ఖండిస్తూ, మరొక మతం పుట్టింది. హిందూమతాన్ని కాదని బౌద్ధ, జైనమతాలు వచ్చాయి. హిందువులలో శైవులు, వైష్ణవులు చావచితకబాదుకున్నారు. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా మతాలన్నీ పరమత ద్వేషంతో పుట్టి పెరిగినవే. మతాలు హింసను పోషించి ఆచరించాయి. చివరకు బౌద్ధంకూడా అలాంటిదే. అల్లా ఒక్కడే దేవుడంటున్న ముస్లింలు మిగిలిన దేవుళ్ళను ఒప్పుకోరు. క్రైస్తవులూ అంతే. అందరు చెప్పేది ఒక్కటే అయితే, మతప్రచారం అర్థరహితం గదా.

కాని మన రాజకీయవాదులు, పదవులలో వున్నవారు జాతీయసమైక్యత పేరిట తమను మోసగిస్తూ, ఇతరులను భ్రమింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. మతకలహాలు జరిగినప్పుడు, సభలుపెట్టి చిలకపలుకులు వల్లిస్తున్నారు. వారికి చిత్తశుద్ధిలేదు. ఉంటే దేశంలో పౌరులందరికీ ఒకే కోడ్ ఎప్పుడో అమలుచేసేవారు.

పంజాబ్ లో శిక్కుల మతపరమైన కోర్కెలు ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి సెక్యులరిజాన్ని చావుదెబ్బ కొట్టింది. మిగిలిన మతాలవారు కూడా వెనకా ముందూ చూచుకొని మతాధిక్యతపై ప్రయత్నిస్తారు.

సెక్యులరిజం చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది.

ఇందిరాగాంధీకి వ్యక్తిగతంగా ఏ నమ్మకాలున్నాయో మనకు అనవసరం. ఎన్.టి.రామారావు స్వయంగా దైవాంశ సంభూతుడనని కలలు కంటే మనం చేయగలిగిందేమీలేదు. కాని ప్రధానిగా ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు ప్రజలకు బాధ్యులు. వారేమిచేసినా ప్రజలు గమనిస్తారు. ఇక్కడే వ్యక్తిగత నమ్మకాలకూ, ప్రభుత్వ ఆచరణకూ గిరి గీయవలసి వుంటుంది. వీరిద్దరూ ప్రభుత్వ ఖర్చు లేకుండా, ప్రైవేటుగా తిరుపతి వెళ్ళినా సంతోషిమా దగ్గర ప్రణామం చేసినా మనకు అనవసరం ప్రజల డబ్బుతో పటాటోపంగా తమ భక్తిప్రపత్తులను ప్రచారం చేయడం సెక్యులర్ వ్యతిరేకం. ఇతర మతాలవారిని తృప్తిపరచడానికి