పుట:Abaddhala veta revised.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవగాహన చేసుకోవాలి. ముఖ్యంగా మానవవాదులు, హేతువాదులు, సందేహవాదులు, నాస్తికులు గ్రహించాలి.

మన సమాజాలు పెత్తందారీ విధానంలో వున్నాయి. అధికారాన్ని కొలిచే సంప్రదాయంలో అలవాటుగా పెరుగుతున్నాం. తల్లిదండ్రులు చెప్పిందే చిన్నప్పుడు వేదం. బడిలో ఉపాధ్యాయులు చెప్పిందే సరైనది అని నిర్ధారణగా నమ్ముతారు. సమాజంలో రాజకీయ నాయకులు, సినిమా తారలు,బాబాలు, చాలామందిని నడిపిస్తున్నారు. వీరందరిలో మూఢనమ్మకాలు అలవాటుగా, వంశపారంపర్యంగా వస్తున్నవి.

చిన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, సమాజంలో పెద్దలు చెప్పిన మూఢనమ్మకాలు వాళ్లల్లో గాఢంగా నాటుకపోయివుంటాయి. అలాంటప్పుడు సైంటిస్టుగా, ఇంజనీర్ గా, డాక్టర్ గా చదువుకున్న వ్యక్తి తన పరిధిలో, తన ప్రాక్టీసులో నిపుణుడుగా తేలినా, మిగిలిన రంగాలలో మూఢనమ్మకాలను పట్టించుకోడు. కనుక చిన్నతనంలో మనస్సులో నాటుకుపోయిన నమ్మకాలు విజృంభించి పనిచేస్తాయి. ఈ విషయాలను పరిశీలించి కార్ల్ శాగన్ చక్కని గ్రంథం రాశారు. అందుకే జేమ్స్ రాండి అంటాడు-చదువుకున్నవారిని,సైంటిస్టులను భ్రమలో పెట్టడం మోసగించడం తేలిక అని, ఏదో ఒక అద్భుతం జరుగుతున్న చోటుకు పరిశీలక బృందం వెడితే, అందులో ఒక మెజీషియన్ వుండడం అవసరమని జేమ్స్ రాండి అన్నాడు. లేకుంటే కనికట్టుతో, ఇంద్రజాలంతో బురిడీ కొట్టించడం చాలా తేలిక. సైంటిస్టులు ముక్కుసూటిగా పోతూ, యీ పక్కదారుల్లో జరిగే మాయాజాలాన్ని పట్టించుకోరు. పైగా వాటిని గ్రహించానికి వేరే శిక్షణ వుండాలి.

రాజ్యాధికారంలో వున్న వ్యక్తులు జ్యోతిష్యాన్ని, వాస్తును, యోగంను చిట్కావైద్యాలను ప్రచారం చేసినప్పుడు, ప్రజలు పక్కదారులకు పోతుంటారు. అందుకే రాజకీయవాదుల్ని బాబాలు ఆశ్రయించి తమ పని సులువు చేసుకుంటారు. ఉభయులూ జనాన్ని మోసం చేయడం, వారి పబ్బం గడుపుకోవడానికే.

అలాంటి వాతావరణంలో కొందరు హేతువాదులు,మానవవాదులు నాస్తికులు సైతం ఒక్కోసారి ఏదో ఒక మూఢనమ్మకం దగ్గర తప్పటడుగు వేస్తారు. శాస్త్రీయ పద్ధతిని అన్వయించడంతో అది విమర్శలకు దారితీస్తుంది.

ఇలాంటి విషపూరిత సామాజిక మూఢనమ్మకాల వాతావరణంలో ఏం చేయాలి?

శాస్త్రీయ పద్ధతి మూలసూత్రాలు వంటబట్టించుకోవాలి. సమస్య ఎదురైనప్పుడు శాస్త్రీయ పద్ధతిలో అన్వేషించే అలవాటు చేసుకోవాలి. ఏ ప్రశ్న వేయాలి, ఎలాంటి పరికరాలు వాడాలో అన్వేషించడంలో ఏ మార్గం అనుసరించాలి, అనేవి గ్రహించాలి. ఒక్కొక్క మూఢనమ్మకం వెనుక వున్న విషయం ఏమిటి అనేది చూడాలి. సైన్స్ పరిశోధనలు ఒకసారి వచ్చి ఆగిపోవు. నిత్యనూతనంగా జరిగే, ప్రక్రియ అది. కనుక ఎప్పటికప్పుడు కొత్త అంశాలు ఏమి వచ్చాయో చూడాలి.