పుట:Abaddhala veta revised.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంగంలోకి దిగి మోసాలకు పాల్పడుతున్నాడు. మరికొందరు మూర్ఖంగా మతగ్రంథాలలోనే సర్వస్వం వున్నదని నమ్ముతున్నారు. కాని ఇంకా కొందరు తత్వం పేరిట సిద్ధాంతీకరిస్తూ శాస్త్రాన్ని వెక్కిరిస్తున్నారు. పోస్ట్ మోడరనిస్ట్ శాఖ యిందులో ఒకటి. ఇంకా సాంస్కృతిక సాపేక్షత వాదులున్నారు. నియోమార్క్సిస్టులు వీరికి తోడయ్యారు. ఫాయర్ బాండియన్లు, కున్ వాదులున్నారు. అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని విల్సన్ కొత్త పుస్తకం రాశాడు. విజ్ఞానం సంకుచితం కాదనీ, మానవుడిని పెంచేదేకాని తగ్గించేది కాదని విల్సన్ అన్నాడు. అందుకే వివిధ విజ్ఞాన శాఖల సమన్వయం కోరుతున్నాడు.

వికాసయుగం మానవుడిని స్వేచ్ఛ వైపుకు నడిపించిన విషయం విల్సన్ గుర్తు చేస్తున్నాడు. మానవుడి పురోగతికి అత్యంత శక్తివంతమైన ఆయుధం విజ్ఞానమే.

విజ్ఞానాన్ని సమన్వయీకరించడం అవసరమైన విల్సన్ మూల సిద్ధాంతం ముఖ్యమైనది. ఎవరికి వారు ప్రత్యేక కృషి చేసి, ఆయా రంగాలలో ఎన్నో కనిపెడుతున్నాడు. సాధిస్తున్నారు. కాని బయట ఏం జరుగుతున్నదో గ్రహించడంలేదు. అందువలన మూఢనమ్మకాలు, మూర్ఖత్వాలు వుంటున్నాయి. సమన్వయీకరణ జరిగితే యీ లోపం సవరించవచ్చు. కెమిస్ట్రీలో జరిగేది, జీవశాస్త్రజ్ఞులకు,ఫిజిక్స్ లో పరిశోధనలు, భూగర్భ శాస్త్రజ్ఞులకూ, ఖగోళంలో ఏం జరుగుతున్నదో మానసిక శాస్త్రజ్ఞులకూ తెలియాలంటే, సమన్వయీకరణ జరగాలన్న మాట. ఎవరికివారే మడిగట్టుకొని,తమదే గొప్ప రంగం అనుకొంటూ, మిగిలిన రంగాలను పట్టించుకోపోవడం లోపం. ఇది తొలగాలి.

లోగడ కార్నప్, రైకన్ బాక్, ఎం.ఎన్.రాయ్, వంటివారు యిలాంటి సమన్వయీకరణ ధోరణులు కొంత వరకు చేశారు. అలాంటి కృషి చాలా భారీ ఎత్తున యిప్పుడు జరగాలని విల్సన్ ఉద్దేశం.

విజ్ఞాన రంగంలో ఒక భాగం మరొక విభాగానికి ఎలా ఉపకరిస్తుందో శాస్త్రజ్ఞులు గ్రహిస్తున్నారు. సమన్వయీకరణలో కేవలం విజ్ఞానశాస్త్రాలేగాక, మానవశాస్త్రాలు, సమాజిక శాస్త్రాలు చేర్చడం విల్సన్ విశిష్టత. అక్కడే వివాదం తలెత్తుతున్నది.

పరిణామంలో జన్యుకణాలు, పరిసరాలు రెండూ పరస్పరం ప్రాధాన్యత వహిస్తూ, పోతున్నాయనేది విల్సన్ మూలసిద్ధాంతం. అలాంటి సమన్వయీకరణ సాధ్యం కాదని రిచర్డ్ రోర్టీ (Richard Rorty) వాదిస్తున్నాడు. చాలాకాలం పట్టినాసరే అలాంటి సమన్వయీకరణ వైపు సాగి పోవడం అవసరమనీ, సాధ్యమనీ విల్సన్ అంటాడు.

విజ్ఞానాన్ని నీతికి సైతం అన్వయించవచ్చని విల్సన్ అంటాడు. మొత్తం మీద గొప్ప గ్రంథం రాసి విల్సన్ మళ్ళీ సంచలనం సృష్టించాడు.

- మిసిమి మాసపత్రిక,నవంబర్-1998