పుట:Abaddhala veta revised.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవం పరిణమించలేదు. అప్పుడు ఆత్మలు లేదా జన్మలు, ఎక్కడ వున్నాయి?

పునర్జన్మ సిద్ధాంతానికీ జనాభా పెరుగుదలకూ వున్న వైరుద్ధ్యం ఉంది. మానవశరీరంలోనే మానవుడి ఆత్మ వుండగలదంటే జనాభా సిద్ధాంతంలో యిమడదు. కొత్త ఆత్మలు పుట్టవనీ, ఆత్మలు అనాదిగా శాశ్వతమనీ అంటే, జనాభా సిద్ధాంతం దీనిని తిప్పికొడుతుంది.

అటు పాశ్చాత్యులు యిటు ప్రాచ్యవాదులు నమ్ముతున్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను విపులంగా పరిశీలించిన గ్రంథం పాల్ ఎడ్వర్డ్స్ రాసిన 'రెయిన్ కార్నేషన్'. పూర్వావరాలన్నీ ప్రస్తావించి, చివరకు శాస్త్రీయాధారాలకు నిలవబోవడం లేదని చాటారు.

ఇండియాలో జరిగినట్లు వింతగా నమోదైన అనేక పునర్జన్మ విషయాలను రచయిత ప్రస్తావించారు. తాను కొలంబియా యూనివర్శిటీలో చదువుతుండగా వేద ప్రకాశ్ మనగ్దలా అనే సహపాఠి ఎన్నో ఉదంతాలు చెప్పాడట. ఏమీ చదువుకోని ఒక రైతు ఒకనాడు పొద్దున్నే లేచి ధారాళంగా సంస్కృతం మాట్లాడాడట. అలాగే 1926 ఉత్తరాదిలో జరిగినట్లు ప్రచురితమైన జగదీష్ పునర్జన్మ విషయాలు పేర్కొన్నారు. వాటిలో పూర్వాపరాలు చూడకుండా శాస్తీయ పరిశీలన చేయకుండా ఎలా నమ్మారో చూపారు. ఈ విషయమై సి.టి.కె.చారి రాస్తూ మతపరంగా కొందరు అబద్ధాలు ఆడడం, కథలు అల్లడం, పవిత్రత పేరిట ఆనవాయితీగా వచ్చినట్లు స్పష్టంచేశారు. పునర్జన్మ కథలలో భాష్యకారులను, నిలబడి చూచేవారిని, తల్లిదండ్రులను నమ్మజాలమని, ప్రశ్నించాలని చారి రాశారు.

రాకేష్ గౌర్ పునర్జన్మ ఉదంతం ఇండియాలో జరిగినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఇది పేరా సైకాలజి జర్నల్ లో ప్రచురితమైంది 1981లో. 1969లో పుట్టిన రాకేశ్ గౌర్ తోంక్ అనే నగరంలో విఠల్ దాస్ గా పుట్టి గిట్టినట్లు చెప్పిన కథయిది. రాకేష్ ప్రయాణం, వెంట తండ్రి వుండడాన్ని రాశారు.

పాశ్చాత్యులు రాసేసరికి నమ్మేస్తారు. పాశ్చాత్యులలో మనకంటె నమ్మకస్తులున్నారని మరవకూడదు. శాస్త్రీయ పరిశోధనా పద్ధతులు అన్వయించి పరిశీలించారా లేదా అనేదే ప్రధానంగా చూడాలి. రచయిత యీ దృష్టితో గమనించి, నమ్మకాలను నిరాకరిస్తున్నారు.

అబద్ధాలు కొన్నాళ్ళుకు నిజాలుగా ప్రచారం గావడం, ఒక్కొక్క వ్యక్తి తన అబద్ధాలను ఉత్తరోత్తరా, నిజమని తానే నమ్మడం చుస్తున్నాం. పునర్జన్మ, కర్మ నమ్మకాలలో యిలాంటివి వున్నాయి. ముందుగానే నమ్మి, వెళ్ళి చూస్తే అద్భుతాలు జరిగినట్లే వుంటాయి. వాటిని నిశితంగా పరిశీలించే శక్తి నమ్మకస్తులకు వుండదు. ఇది చదువుకున్న వారికి, కొన్ని సందర్భాలలో శాస్త్రజ్ఞులకూ వర్తిస్తుంది. శాస్త్రజ్ఞులను సైతం అద్భుత మాయాజాలంతో మోసగించవచ్చు. కనుక పరిశీలన బృందాలలో మంత్రజాలం తెలిసిన వారిని చేర్చితే చాల వాస్తవాలు బయటపడతాయి.