పుట:Abaddhala veta revised.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేడు ఆ సంస్థలోనే చదవడం లేదు. కాని ఆయన సమకాలీనులు రాజకీయాల్లో లాస్కీ వద్ద వ్యాకరణం నేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా లాస్కీ ప్రభావం వుండగా, వామ పక్షాలపై యీ ప్రభావం వీరారాధనకు పోయింది. 1993ఓ లాస్కీ శతజయంతి కూడా జరిపారు.

మాంచెస్టర్ లో సంపన్న యూదుకుటుంబంలో పుట్టిన హెరాల్డ్ లాస్కీ,హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బోధించి గొప్ప పేరు పొందాడు. తరువాతే లండన్ లో స్థిరపడి 1950లో చనిపోయే వరకూ ఉపాధ్యాయుడుగా వున్నాడు. ఆయన రచయితే గాక, గొప్ప వక్త కూడా ఇంగ్లండ్ రేషనలిస్ట్ సంఘాధ్యక్షుడుగా కొంతకాలం వున్న లాస్కీ, లేబర్ పార్టీ సోషలిస్టుగా వున్నాడు. అయితే ఒకసారి నమ్మిన వాటిని మళ్ళి మళ్ళీ రాస్తూ, కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని సరిగా గమనించక పోవడం ఆయన లోపం.

ఫేబియన్ సోషలిస్ట్ గా పరిణమించిన లాస్కీ, బలీయ కేంద్ర ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటించాడు. కొన్నాళ్ళు సిడ్నీ బీట్రిస్ వెబ్ సిద్ధాంతాల ప్రభావం కింద లాస్కీ వున్నాడు. సోవియట్ యూనియన్ ను సమర్ధించి, అమెరికా సామ్రాజ్యవాదాన్ని లాస్కీ ఖండించాడు. లెఫ్ట్ బుక్ క్లబ్ స్థాపించిన లాస్కీ అటు ఉపాధ్యాయుడుగానూ యిటు ప్రపంచ వ్యవహారాలలోనూ ఆసక్తితో పాల్గొన్నాడు.

లియో జిలార్డ్: అణ్వాయుధాలు సొవియట్ యూనియన్,అమెరికాల మధ్య ప్రచ్ఛన్న పోరాటసమస్యలలో కీలక పాత్ర వహించిన మేధావి లియోజిలార్డ్ (Leo Szilard) అతడు సామాజిక,రాజకీయ, ఆర్ధిక విషయాలలో ప్రతిభాశాలి. శాస్త్రీయ పరిశోధనకు అగ్రతాంబూలం యిచ్చాడు. 1932లోనే హిట్లర్ అధికారానికి రాబోతునాడని గ్రహించి యితరులను హెచ్చరించిన యింగిత జ్ఞాని. 1937లో అతడు యూరోప్ నుండి అమెరికా వలన వెళ్ళి ప్రధాన పాత్ర వహించాడు. అణుశాస్త్ర పరిశోధనలు బయట పెట్టవద్దని జర్మనీ పాలకుడైన హిట్లర్ కు అవి తెలిస్తే ప్రమాదం అని హెచ్చరించాడు.

బాంబు ప్రయోగాన్ని గురించి అమెరికా అధ్యక్షుడికి నచ్చ చెప్పడానికి ఐన్ స్టీన్ న్ని కూడా రంగంలో దింపాలని జిలార్డ్ ప్రయత్నించాడు. ది వాయిస్ ఆఫ్ ది డాల్ఫిన్స్ అనే రచన చేసిన జిలార్డ్, తరచు ఆటమిక్ సైంటిస్టుల బులిటన్ లో వ్యాసాలు రాసేవాడు. "ఏటెమ్స్ పర్ పీస్" బహుమానం పొందిన జిలార్డ్ చివరి దాకా ఆస్థి పాస్తులు లేకుండా బ్రతికిన మేధావి. తన అభిప్రాయాలు అటు కృశ్చేవ్ కూ,యిటు కెనడీకి తెలియపరచిన జిలార్డ్, కాన్సర్ వ్యాధితో మరణించాడు. ఆయన మేధస్సుకు ఎడ్వర్డ్ షిల్స్ చాలా గొప్పగా హారతులిచ్చాడు.

జాన్ యునెఫ్: చికాగో విశ్వవిద్యాలయ స్థాపకులలో ఒకరైన నెఫ్ గొప్ప మేధావి. ఆయన బొగ్గును గురించి రాసినా,అందరితో కథవలె చదివించగల సత్తా వున్న ప్రతిభావంతుడు. వాస్తవానికి బొగ్గుపరిశ్రమపై ఆయన చేసిన పరిశోధన గొప్పది.