పుట:Abaddhala veta revised.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరన్ తో తన 40 సంవత్సరాల పరిచయాన్ని షిల్స్ చక్కగా కుదించి వివరించారు. జాన్ పాల్ సాత్రె ఒకవైపున ఆరన్ ను విపరీతంగా ఖండించినా, ఆరన్ అతడి పట్ల ఓర్పుగా వ్యవహరించిన తీరును పేర్కొన్నారు. మానవసమాజాలను తాత్వికంగా పరిశీలించిన ఆరన్ ఎన్నో ఒడిదుడుకులకు, విమర్శలకూ, ఖండన మండనలకూ తట్టుకున్నాడన్నారు. మానవ మస్తిష్కంనుండి హేతువును మట్టుబెట్టడం దుస్సాధ్యమని ఆరన్ దృఢ విశ్వాసం. వివేచన పట్ల అచంచల విశ్వాసంతోనే ఆరన్ రచనలు సాగించాడు. నిగ్రహంగా వ్యవహరిస్తూ, ఇతరుల పట్ల జాగ్రత్త వహిస్తూ, మేధావిగా సమాజాన్ని ప్రబావితం చేసిన వ్యక్తిగా ఆరన్ ను షిల్స్ పేర్కొని, జోహార్లు అర్పించారు.

22 పుటలలో ఆరన్ గురించి ఎంతో నిగూఢంగా షిల్స్ చూపగలిగారు. ఆయన వెలుగు నీడల్ని అందంగా పేర్కొన్నారు. వ్యక్తిత్వం అంచనా వేసిన తీరు చూచి మనం ఎంతోనేర్చుకోవచ్చు. రేమండ్ ఆరన్ గురించి మనలో చాలామంది చదివినా, షిల్స్ చెప్పిన తీరు హుందాగా, వివేచనాత్మకంగా, నిష్పాక్షింగా వుంది. వ్యక్తి చిత్రణ అలావుండాలి. సన్నిహిత పరిచయంగల మేధావిని గురించి ముఖస్తుతి చేయకుండా,లోకానికి అద్దం పట్టిచూపడం షిల్స్ వంటి సామాజిక శాస్త్రజ్ఞుడికే తగును.

నిరాద్ సి. ఛౌదరి: షిల్స్ చిత్రణలో ఒక భారతీయ మేధావి ఛౌదరి చోటు చేసుకున్నాడు. ఆ విధంగా ప్రపంచ మేధావుల కోవలో నిరాద్ ఛౌదరి నిలబడ్డాడు. షిల్స్ కు బాగా పరిచితుడు, యిష్టుడైన మరొక భారతీయ నవలాకారుడు ఆర్.కె.నారాయణ.

1921లో కలకత్తా యూనివర్శిటీలో డిగ్రీ పొందలేక, వదిలేసిన నిరాద్ ఛౌదరి ఆలిండియా రేడియోలో వుద్యోగంచేస్తూ పదవీ విరమణానంతరం ఇంగ్లాండ్ ప్రవాసం వెళ్ళాడు. రచయితగా భారతదేశంలో పేరున్నా బ్రతకడానికి తగిన ఆధారవృత్తి కాలేదు. అందుకని భార్య ప్రోత్సాహంతో దేశాంతరం తరలి, పెద్ద పేరు పొందాడు. కాని దేశాన్ని ప్రేమించడం మానలేదు. ఆయన నిశితపరిశీలన,విమర్శ చాలామందికి నచ్చక పోయినా, అలాగే చెప్ప దలచింది నిర్మోహమాటంగా రాశాడు. గాంధీజీ పట్ల తీవ్ర విమర్శ చేస్తూ, దేశాన్ని వెనక్కు నడిపించే ఆయన ధోరణిని దుయ్యబట్టాడు. ఆయన రచనలలో ది ఆటోబయాగ్రఫీ ఆఫ్ ఏన్ అన్ నోన్ ఇండియన్, ది హేండ్ గ్రేట్ అనార్క్ అనే రెండూగొప్పవని షిల్స్ పేర్కొన్నారు. భారత సమాజం, పాశ్చాత్య భావాలతో సంబంధం అనేవి ఛౌదరి. ది ఇండియన్ ఇంటలెక్చువల్, హిందూయిజం కాంటినెంట్ ఆఫ్ సర్సి, క్లైవ్, మాక్స్ ముల్లర్ గురించి రాశారు.

భారతీయుడుగా, బెంగాలీగా, యూరోప్ వాసిగా, ఇంగ్లీష్ మన్ గా స్పందించిన ఛౌదరి, విశిష్ట రచయితగానే నిలిచాడు. ప్రపంచ పౌరుడుగాపరిణమించాడు.