పుట:Abaddhala veta revised.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహిత్యం ద్వారా సోషియాలజిలోకి వచ్చిన మేధావి. ఆయన రచనలు ప్రామాణికంగా ఉన్నత స్థాయిలో వుండేవి.

చికాగో విశ్వవిద్యాలయంలో ఒకప్పుడు ఎంత వున్నతస్థాయి పరిశోధన, పరిశీలన, బోధన కొనసాగిందో షిల్స్ పీఠికలో అవగహన అవుతుంది. హెరాల్డ్ లాస్ వెల్, టాల్కాట్ పార్సన్స్, రాబర్ట్ పార్క్, ఫ్రాంక్ నైట్ వంటి వారు ఉద్దండులుగా వున్న యూనివర్శిటీలో షిల్స్ రాటు తేలాడు. వారి సహచర్యం, బోధనా పటిమలు స్ఫురణకు తెచ్చుకొని, ప్రస్తుతించాడు. కాని ఎక్కడా అతిశయోక్తి భట్రాజీయం కనిపించదు. షిల్స్ అంచనాలు మాత్రం ఆకర్షణీయంగా వున్నాయి. లూయిస్ విర్త్ (Louis Wirth) తనపై చూపిన ప్రభావాన్ని షిల్స్ వివరించారు.

జాన్ నెఫ్ నాడు చికాగో విశ్వవిద్యాలయంలో పేరొందిన ఆర్ధిక శాస్త్రవేత్త, అతని లెక్చర్స్ కూడా షిల్స్ విన్నాడు. అప్పటికే మాక్స్ వెబర్, ఎమిలిడర్క్, హైగల సోషియాలజీతో ప్రభావితుడైన షిల్స్ చికాగో వాతావరణంలో పై స్థాయికి ఎదిగాడు. ఆపరిస్థితులు నేడు మారి పోయాయని, ఫెడరల్ ప్రభుత్వ యిష్టాయిష్టాల పై వుండడం, నిధులకోసం ట్రస్టీల పై ఆధారపడడం, గిరిగీసుకొని గూడుకట్టుకొని ముడుచుక పోవడం నేడు స్పష్టంగా వున్నదనీ షిల్స్ విచారం వ్యక్త పరిచారు. నేటికీ చికాగోలో ఉన్నతస్థాయి విద్యావాతావరణం వున్నదని వారితో షిల్స్ అంగీకరించలేకపోయాడు. తరాల అంతరం కనిపిస్తున్నదన్నాడు. షిల్స్ పీఠిక కాగానే, ఒక్కొక్క వ్యక్తినీ కూలంకషంగా పరిశీలించిన వ్యాసాలు వున్నాయి.

రేమండ్ ఆరన్:ఫ్రాన్స్ లో 1983 అక్టోబరు 17న అస్తమించిన సుప్రసిద్ధ సామాజిక శాస్త్రజ్ఞుడు రేమండ్ ఆరన్ (RAYMOND ARON) ప్రపంచంలో కీన్స్ (Keynes) తరువాత, అంతగా ఆకర్షించిన సోషల్ సైంటిస్టు. ఆయన మాటను యూరోప్, అమెరికా ప్రముఖులు పట్టించుకునేవారు. హెన్రీకి సింజర్,రాబర్ట్ మక్ నమారా వంటి వరు చెవిన పెట్టేవారు. కాని ఫ్రాన్స్ లో ఆయనను ఏకాకిని చేసి రియాక్షనరీ అని, ఫాసిస్టు అని వామపక్షాలవారు పేర్లు పెట్టారు.ఆండ్రి మాల్రా (Andre Malrawx) వంటివారి అభిమానాన్ని పొందిన ఆరన్ చివరి రోజులలో ఫ్రాన్స్ దృష్టిని ఆకర్షించారు. మార్క్సిజం పట్ల నిశిత పరిశీలన చేసిన ఆరన్, ఆచరణకూ సిద్ధాంతానికీ మార్క్సిజం చూపిన అఖాతమే దాని పట్ల ఫ్రాన్స్ వైముఖ్యతకు కారణమన్నారు.

విద్యారంగంలో సామాజిక వేత్తగా, ప్రభుత్వరంగంలో ప్రచారవేత్తగా రచనలు చేసిన ఆరన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఖ్యాతిని తెచ్చుకున్నాడు. ప్రజాసమస్యల పట్ల స్పందించిన ఆరన్, బృహత్తర రచన చేయలేక పోయారని చివరిలో బాధపడ్డాడు.

ఆదర్శాలు (utopias) ఆరన్ ను ఎన్నడూ ఆకట్టుకోలేదు. ఏ సమాజమూ సంపూర్ణంకాదనీ, ప్రతిదీ విమర్శకు గురిచేయాలనీ, మార్గాంతరాలతో బేరీజు వేయాలనీ, ఆరన్ ఉద్దేశం. వివేచన యధేచ్ఛగా వినియోగించాలన్నాడు.