పుట:Abaddhala veta revised.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంతకాలు చేశారు. అందుకే యీ విషయంలో మతం-శాస్త్రం చేరువ అయ్యాయని శాగన్ రాశాడు. ఆ సందర్భంగా ఒక ఆసక్తికర విషయం ప్రస్తావించాడు.

వివిధ మతాలవారు సమావేశంలో ప్రార్ధనలు చేశారు. అలాగే భారత వేద పండితుడు ఓం మంత్రాన్ని ఉచ్ఛరించగా అది అందరూ అనుకరించారట. సోవియట్ విదేశాంగ మంత్రి షెవర్ నాట్జి కూడా అందులో చేరి ఓం పఠనం చేశాడట. కాని గొర్భచేవ్ మాత్రం మౌనం దాల్చాడట. ఆయన వెనకే లెనిన్ విగ్రహం వున్నది.

'మన శత్రువులు' అనే అధ్యాయంలో ఇంకో విశేషాన్ని శాగన్ బయటపెట్టారు. అమెరికా రష్యాలు శాగన్ వ్యాసాన్ని ఒకేసారి ప్రచురించాయి. అమెరికాలో పెరేడ్ పత్రిక. రష్యాలో ఓగోన్యాక్ (Ogonyak) ఈ వ్యాసాన్ని ప్రచురించి చర్చకు పెట్టారు. 1988లో జరిగిన విశేషం యిది. మనకు వేరే ప్రపంచాల నుండి ఎవరో వచ్చి దాడి చేసే ప్రమాదం లేదనీ, మనం సహజ వనరులను తగలేయడంలో ప్రమాదం వుందనీ, బొగ్గు తగలేసి కార్బన్ డయాక్సైడ్ పెంచి, వాతావరణం వేడెక్కేటట్లు చేస్తున్నామని శాగన్ హెచ్చరించారు. అమెరికా-రష్యాలు యిది ఆపితే,ఎడారులుగా కొన్ని ప్రాంతాలు మారిపోకుండా వుంటాయన్నారు.

నిజం గురించి అటు అమెరికాకు గాని, యిటు సోవియట్ యూనియన్ కు గాని గుత్తాధిపత్యం లేదని శాగన్ అన్నారు.

ఆ సందర్భంగా లెనిన్ మాటల్ని శాగన్ ఉదహరించారు. సోవియట్ యూనియన్ లో శాగన్ వ్యాసంలోని భాగాలను, లెనిన్ పై వ్యాఖ్యలను సెన్సార్ చేశారు. ఇప్పుడు తమదే తప్పు అని, లెనిన్ ప్రస్తావన చేసిన శాగన్ సరిగానే ఉదహరించాడని అర్భటోల్ తన స్మృతులలో ప్రకటించారు.

గర్భస్రావంపై చర్చించిన అధ్యాయంలో జీవనాన్ని హత్య చేయడం అంటే ఏమిటనే విషయంపై శాగన్ సునిశిత ప్రశ్నలు వేశారు. ప్రతి మనిషి రేతస్సులో భూమిని నింపగల శక్తి వున్నదనీ,రేతస్సు వృధా అవుతుంటే, అదంతా హత్యగా పరిగణించాలా అన్నారు.

ప్రపంచ సంక్షేమ నిమిత్తం ఇస్లాం కూడా కుటుంబ నియంత్రణ పాటించాలని సిరియాకు చెందిన గ్రాండ్ ముప్తి 1990 ప్రపంచ సభలో చెప్పడం అందరినీ ఆకట్టుకున్న విషయం అని శాగన్ జ్ఞప్తి చేశారు.

మరణాన్ని సహజంగా స్వీకరించిన శాగన్ తన గొప్పతనాన్ని యీ గ్రంథంలో చూపాడు. సైన్స్ ను సామాన్యులకు అందించిన శాగన్ శ్లాఘనీయుడు.

- మిసిమి మాసపత్రిక,సెప్టెంబర్-1997