పుట:Abaddhala veta revised.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏదో తెలుసా? క్యూబా. క్యూబా ప్రభుత్వం మాస్కోలో వుంటుంది. క్యూబా సైన్యం ఆఫ్రికాలో వుంటుంది. క్యూబావాసులు అమెరికాలోని ఫ్లారిడా రాష్ట్రంలో వుంటారు.

ఇది సునిశిత విమర్శనాయుత వ్యంగ్యంగా, స్వీకరించాలి. వాస్తవంగా గ్రహిస్తే ప్రమాదం. సైకియాట్రిలో మనిషి ప్రవర్తనను యిలా స్వీకరించడం జరుగుతున్నదని సాజ్ చూపడానికి చాలా ఉదాహరణలు యిచ్చారు.

అనుకరణ గురించి రాస్తూ, మానసిక రోగాలలో యిదెలా పరిణమించిందో చూపారు. ఇతరులను అనుకరించడం, జబ్బుగా వున్నట్లు నటించడం సైకియాట్రి సమస్యలలో ప్రధానంగా వున్నట్లు సాజ్ వివరించారు. చార్కాట్ కాలం నుండీ యిలా మానసిక రోగులుగా, మూర్ఛరోగులుగా నటించడం వస్తున్నది. దానికి తగ్గట్లే నయం చేసినట్లు నటించడం కూడా వచ్చింది.

మానసిక రోగాన్ని వివరించి, మనస్సు, మానసిక రోగం అంటే విడమరచి, అంతా గాలి మాట అని చూపారు.

మొత్తం మీద యీ పుస్తకం "పిచ్చి" వైద్యం చేసే వారికి మింగుడుపడని వాదనలతో వుంది. సాధారణ పాఠకులకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలున్నాయి. మనందరం అలవాటుగా, ప్రశ్నించకుండా ఆమోదించే విషయాలను సాజ్ ప్రశ్నీంచి మనల్ని ఆలోచించేటట్లు చేస్తారు. జబ్బు అనేది చాలా లోతుపాతులతో సాజ్ చర్చించారన్నాం గదా. ఉదాహరణకు కొందరికి "ప్రేమ జబ్బు" వుంటుంది. ఇది ఉపమానంగా స్వీకరించాలేగాని, శరీరానికి ఏదో జబ్బు చేసినట్లూ చికిత్స అవసరమైనట్లూ భావించరాదు. కొందరు ఆర్ధిక యిబ్బందుల వలన దిగజారిపోవచ్చు, మాట్లాడడం యిష్టం లేక మౌనం వహించవచ్చు. వారికి జబ్బు వునట్లు భావించరాదు. కాని సైకియాట్రిస్టులు అలాంటి వారిని కూడా రకరకాల "పిచ్చి" పేర్లు పెట్టి ఆస్పత్రి పాలుచేస్తున్నారు.

రోగికీ వైద్యుడికీ గల సంబంధాన్ని చర్చించినప్పుడు, రోగిపై సైకియాట్రిస్టుకు గల పట్టు ఎలాంటిదో సాజ్ వివరించాడు. ఈ సందర్భంగా ఆయన అధికారానికి చెందిన వివిధ దృక్పథాలను బాగా విడమరచి చెప్పారు.

రోగులకు గల హక్కులను సాజ్ చర్చించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించని రోగులకు హక్కులుంటాయి. చట్టాన్ని అతిక్రమించిన వారిని శిక్షించే తీరు వున్నది. మానసిక రోగులు ఇతరులను కొడుతున్నారని, ఆస్తికి నష్టం కలిగిస్తున్నారని అంటారు. అలాంటి పనులు నేరం క్రిందకు వస్తాయి. కాని అలాగాక, వారికి "పిచ్చి" అని ముద్రవేసి, ఆస్పత్రి పాలు చేసి సైకియాట్రిస్టులు వారిని తమ బానిసలుగా చేసుకుంటున్నారనేది సాజ్ విమర్శ. మతం మత్తుమందు అని మార్క్స్ అన్నాడు. సాజ్ దృష్టిలో మతాన్ని సృష్టించిన మనిషే మత్తును కూడా సృష్టించుకున్నాడంటారు. మాటలగారడీలో పడి కొట్టుకుంటున్నామని సాజ్ వాదన.