పుట:Abaddhala veta revised.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘాలను ఏర్పరచాయి. అతీంద్రియశక్తులున్నాయని చెప్పేవారి నిమిత్తం ఒక సంఘం వుంది. వీరు ఆయా సంఘటనలు జరిగినచోట్లకు వెళ్ళి పరిశీలిస్తారు. వివరంగా పూర్వపరాలు తెలుసుకుంటారు. దీనికి రే హైమాన్ అధ్యక్షులుగా వున్నారు, పేరా సైకాలజి ఉపసంఘం వారు అనేక మౌలిక విషయాలు బట్టబయలు చేశారు. డ్యూక్ విశ్వవిద్యాలయంలో జె.బి.రైన్ ఆధ్వర్యాన మూడు దశాబ్దాలపాటు జరిగిన మోసాల్ని రట్టుచేశారు. అక్కడ శాస్త్రీయ పరిశోధనల పేరిట జరిగినదంతా తంతు అని తెలిపారు.

జ్యోతిష్యవిషయ పరిశీలన సంఘానికి ఇ.డబ్లు.కెల్లీ అధ్యక్షులుగా వున్నారు. సైంటిస్టులు జ్యోతిష్యాన్ని పరిశీలించి అందులో శాస్త్రీయాధారాలు లేవని తేల్చారు. పత్రికలలో జ్యోతిష్యఫలాలు ప్రకటించినప్పుడు, అది కేవలం వినోదం కొరకేనని వ్రాయమని ఎడిటర్లకు విజ్ఞప్తి చేశారు. కొన్ని పత్రికలు అలా చేస్తున్నాయి.

ఆరోగ్యరంగంలో అశాస్త్రీయ చికిత్సలు బయటపెట్టడానికి ఒక సంఘం పనిచేస్తూ వున్నది. విలియం జార్విస్ దీనికి అధ్యక్షులు. అక్యూపంక్చర్, హోమియో, కైరోప్రాక్టిస్ మొదలైన విధానాల వలన హాని,అశాస్త్రీయత బయటపెట్టారు.

ఎగిరే పళ్ళాల గొడవ మనకు అంతగా పట్టలేదుగాని అమెరికాలో యిది తీవ్రంగా వుంది. దీని ఉపసంఘం అధ్యక్షుడు ఫిలిప్ క్లాజ్ లో గుట్టు అంతా బయటపెట్టాడు. ఆయన్ను నేను కలసి ఇంటర్వ్యూ చేశాను. ప్రజలు తమకు తెలియని ఆకాశ వస్తువులపట్ల ఎలాంటి భ్రమలు, ఊహలతో వుంటారో వివరించారు.

అనేక మూఢనమ్మకాలను బట్టబయలు చేయడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడే ఉపసంఘం పనిచేస్తున్నది. ప్రముఖ హేతువాది పేజ్ స్టేఫెక్ దీనికి అధ్యక్షులు. ఆయనతో, సెయింట్ లూయుస్ లో ఒకరోజు గడిపి, చర్చించాను. హిప్నాటిజం, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, దివ్యవాణి, అతీంద్రియ శక్తులు, ట్రిక్ ఫోటోగ్రఫీ మొదలైన విషయాలలో వీరు కంప్యూటర్ల ద్వారా పరిశోధన చేస్తున్నారు.

క్రైస్తవ మత ప్రచారకులు, భక్తితో రోగాల్ని నయం చేస్తామనే వారిని జేమ్స్ రాండి అనే ఆయన ఉతికేస్తున్నాడు. కొందరు ఆయన ధాటికి తట్టుకోలేక దివాళా తీశారు. యూరిగెల్లర్ వంటి మాంత్రికులు కోర్టుకుపోయి, ఓడిపోయి, జేమ్స్ రాండి దెబ్బకు హడలి, పారిపోతున్నారు. అనేక రంగాలలో జేమ్స్ రాండి నేటికీ యువకులకు శిక్షణ యిస్తున్నారు. ఇండియా నుండి ఎవరైన వస్తే శిక్షణ యిస్తారుకూడా. ఆయనతో నేను ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాను. సైన్స్ రంగంలో మోసాలు చేస్తున్నవారి గురించి సుప్రసిద్ధ సైన్స్ రచయిత మార్టిన్ గార్డినర్ అనేక రచనలు చేసి, యధార్ధాలను వెల్లడించారు. 80వ ఏట కూడా ఆయన యింకా యీ కృషిసాగిస్తూ, హేతువాదులకు తోడ్పడుతున్నారు.