పుట:Abaddhala veta revised.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్య దేశాలలో ముస్లింలపట్ల, ఇస్లాం, ఖురాన్ గురించి రాజీధోరణిలో ప్రవర్తించడం వలన, ప్రజాస్వామ్యవిలువల పట్ల రాజీపడినట్లయిందని రచయిత హెచ్చరించారు. స్వేచ్ఛకూ, ఇది లేని వారికీ పోరాటం జరుగుతుందనీ, 21వ శతాబ్దంలో ముందుకు పోవాలంటే స్వేచ్ఛతో కూడిన, ప్రజాస్వామిక మానవ హక్కులు పాటించాలని రచయిత అంటున్నారు.

సాల్మన్ రష్డీ శటానిక్ వర్సెస్ వంటిది కాదీ పుస్తకం. ఒక ముస్లిం పండితుడు ప్రజాస్వామిక, స్వేచ్ఛా పిపాసిగా ఆక్రందనతో రాసిన పుస్తకం యిది. అయితే ముస్లింలలో వున్న అసమానం దృష్ట్యా యీ రచనకు సుప్రసిద్ధ హ్యూమనిస్ట్ ప్రచురణ సంస్థ అమెరికాలో చేబట్టింది. బహుశ ఇస్లాం గురించి యింత విపులంగా, సమగ్రంగా యిటీవల ఏ రచనా వెలువడలేదేమో.

భారత దేశంలో హమీద్ దల్వాయ్, ఎ.బి.షా వంటి వారు చేసిన రచనలు చాలా మందిని ఆలోచింపజేశాయి. ఈ రచన బహుళ ప్రచారంలోకి వస్తే యింకా కళ్ళు తెరుస్తారు. ఖురాన్ గురించి కూలంకషంగా చర్చించిన అనంతరం, సుమారు 6 వేల సురా సూత్రాలతో కూడిన ఖురాన్ ను రోజూ ముస్లిం పిల్లలకు నూరిపోసి, కంఠస్తం చేయించడం కూడా రచయిత ప్రస్తావించారు.

- మిసిమి మాసపత్రిక, ఏప్రిల్-1997
పిశాచ పీడిత ప్రపంచం

కార్ల్ శాగన్ ఒక ఆకర్షణీయ, అపూర్వ శాస్త్రజ్ఞుడు. ఆయన చనిపోబోయే ముందు (1996) ఒక పుస్తకం రాసిపోయాడు. దాని శీర్షిక: పిశాచ పీడిత ప్రపంచం (The Demon haunted world) (కార్ల్ శాగన్ 62వ యేట 20 డిసెంబరు 1996న మరణించారు.)

శాగన్ ఏది రాసినా, చెప్పినా జనానికి అర్థమయ్యేట్లు, అందుబాటులో ఆచరించేటట్లు చెప్తాడు. కాస్మాస్ పేరిట ఆయన రాసిన పుస్తకమూ అంతే, ప్రపంచ వ్యాప్తంగా కాస్మాస్ కార్యక్రమాలు టి.వి.లలో తిలకించిన వారికి యీ సంగతి తెలుసు. సైన్స్ ను ఆకాశం నుండి భూమి మీదకు తెచ్చిన సైంటిస్టు శాగన్. సైన్స్ నిపుణులు లోతుపాతులు గ్రహించి అనేక విషయాలు కనిపెడతారు. వాటిని సాంకేతిక నిపుణులు ఆచరణలో పెడతారు. అదే ఉపయోగం, అందులోనే హానికూడా వుంది. హాని ఎక్కువ అతిశయోక్తులతో చూపి, అది సైన్స్ కు అంటగట్టి, బూచిగా చిత్రించిన సందర్భాలున్నాయి.

కార్ల్ శాగన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు. కార్ల్ మార్క్స్ తత్వాన్ని భూమి మీదకు తెచ్చి జనంలో పడేయమన్నాడు. సైన్స్ ను ఒక తత్వంగా చూచిన శాగన్ అదేపని సమర్ధవంతంగా చేసి, ఎంతో సేవ జరిపిన వాడయ్యాడు.