పుట:Abaddhala veta revised.pdf/403

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నిర్ధారించారు. ఒక బెలూన్ మీద చుక్కలు పెట్టి, గాలివూదితే, బెలూన్ పెరుగుతూ వుంటుంది. అప్పుడు చుక్కలన్నీ వెడల్పు అవుతూ వుంటాయి. అన్నీ ఒక దానినుండి మరొకటి జరుగుతూ పోతాయి. ఇందులో ఏదీ కేంద్రస్థానం కాదు. అలాగే మన విశ్వంకూడా. ఇప్పుడు కనిపెట్టినదాన్నిబట్టి విశ్వం యిలా క్రమంగా విస్తరిస్తూ ఒక తారనుండి మరొకటి యెడమైపోతుంటే, ఒకప్పుడు ఇవన్నీ దగ్గరగా వున్నాయన్నమాట. యెప్పుడో ఒకనాడు అవి ఒకచోట నుండి ప్రయాణం మెదలెట్టాయన్న అర్థం వస్తుంది. ఆ ప్రారంభదశనే (బిగ్ బాంగ్) బ్రహ్మాండం బద్దలు కావడం అన్నారు. అంటే కాలం కూడా అప్పుడే మొదలైందని అర్థం. దీన్ని దేవుడి సృష్టిగా మతవాదులు నమ్ముతున్నారు. అంతకు ముందు ఏముంది అనే ప్రశ్నకు తావు లేదంటున్నారు.

విశ్వానికి సంబంధించిన సిద్ధాంతాలన్నీ బిగ్ బాంగ్ దగ్గర విఫలమయ్యాయా? ఇది పెద్ద చిక్కుప్రశ్న. హాకింగ్ యిందుకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. క్వాంటం సిద్ధాంతం పేర్కొన్న అనిశ్చిత సూత్రాన్ని అన్వయిస్తే ఇందుకు జవాబు లభిస్తుందని ఆయన ఆశిస్తున్నాడు. అనిశ్చిత సూత్రం అంటే ఏమిటి?

స్థూల ప్రపంచం అంటే మనం చూస్తున్న భూమి, గ్రహాలు, గోళాలు,తారలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నమాట. ఇక్కడ నిర్ధారణగా జరిగే సంఘటనలు చెప్పవచ్చునని, కార్యకారణ సంబంధం వుందని సైన్స్ భావించింది. లాప్లాస్ యీ నిర్ధారిత సూత్రానికి మూలపురుషుడు. ప్రపంచం ఇప్పుడు ఎలావుందో, ఎటు పయనిస్తుందో గమనిస్తే మున్ముందు ఏమౌతుందో చెప్పవచ్చు అన్నారు. ఇలా నిర్ధారితమైపోతే, దేవుడి స్వేచ్ఛ ఏమైనట్లు అని మతవాదులు వాపోయారు. నిర్ధారితవాదాన్ని, కార్యకారణ సంబంధాన్ని ఐన్ స్టీన్ వరకూ నమ్మారు. ఆ దశలో అస్థిరత వచ్చిపడింది. దీనికి మూలం హైసెన్ బర్గ్ అనే శాస్త్రజ్ఞుడు. ఇది సూక్ష్మ ప్రపంచానికి చెందిన విజ్ఞానం అంటే ఎక్స్ రేలు, గామారేలు, కాంతి, సుక్ష్మాణువులు మొదలైన వాటికి చెందినవన్నమాట. ఎలక్ట్రాన్ యెక్కడుందో చెబితే యెటుపోతుందో వూహించవచ్చు. యెటుపోతుందో నిర్ధారిస్తే, యెక్కడ వుంటుందో చెప్పవచ్చు. అలా జరగాలంటే ఎలక్ట్రాన్ పై కాంతిని ప్రసరింపచేయాలి. ఆ కాంతి ఎలక్ట్రాన్ స్థితిని, గతిని మార్చేస్తుంది. ఎలక్ట్రాన్ గురించి నిర్ధారణగా చెప్పలేకపోయారు. ఇది మనం వాడే పరికరం వలనగాని, మన జ్ఞానలోపం వలనగాని జరుగుతున్నది కాదని కూడా తేలింది. అనిశ్చితం అనేది సూక్ష్మాణువుల లోకానికి చెందిన వాస్తవం అని రుజువైంది. అక్కడే ఘర్షణ మొదలైంది. కార్యకారణవాదం దెబ్బతిన్నది. సైన్సులో ఐక్యతావాదులు పొందిక కోసం ఎంతో ప్రయత్నించి విఫలమయ్యారు. ఐన్ స్టీన్ తన సాపేక్షత సిద్ధాంతంలో క్వాంటం అనిశ్చితను పరిగణనలోకి తీసుకోలేదు. అప్పటినుండే క్వాంటం సిద్ధాంతం తీసిన దెబ్బను తట్టుకోడానికి కార్యకారణవాదులు, నిశ్చితవాదులు ప్రయత్నిస్తూనే వున్నారు. ఎప్పటికైనా విశ్వంలోని నాలుగు శక్తుల్ని ఐక్యంగా చూసే అవకాశం అభిస్తుందనీ, అందుకు దగ్గరగా చేరుకుంటున్నమనే హాకింగ్ కూడా నమ్ముతున్నాడు. ఆ నాలుగు శక్తులు వాటి వివరాలు ఏమిటో పరిశీలిద్దాం.